Print

ఆంగ్లేయుల పాలనలో ఇండియా

భారతదేశ చరిత్ర కనీసం 5000 సంవత్సరాల నాటిది. ఎన్నో భాషల్లో, ఎంతోమంది దార్శనికులు ఈ చరిత్రను గ్రంధస్థం చేయడానికి ప్రయత్నించారు. చాలా వరకు సఫలీకృతులైనారనే చెప్పుకోవాలి, వారందరికీ నా అభివందనాలు, కృతజ్ఞతలు.

ప్రస్తుత సందర్భంలో మరొక్కసారి గత నాలుగయిదు వందల సంవత్సరాల చరిత్రను పునరావృతం చేసుకోవడం అవసరమనిపించింది. క్రీ.శ. 1600 సంవత్సరంలో సర్ థామస్ స్మిత్ మరికొంతమంది ఆంగ్ల వ్యాపారులతో ఇండియా తో ఎగుమతి, దిగుమతుల వ్యాపారార్ధం "ఎలిజబెత్ మహారాణి అనుమతితో" ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించాడు. 1600 సం.లో ఇండియా మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలనలో వుండేది. 1605 సం.లో అక్బర్ మరణించిన తర్వాత ఆయన కుమారుడు జహంగీరు చక్రవర్తి అయ్యాడు. ఆనాటికి భారతదేశ వ్యాపార వ్యవస్థ మొత్తం ఐరోపా ఖండం వ్యాపారం కన్నా చాలా ఎక్కువగా వుండేది. 1612లో సర్ థామస్ రో ఈస్టిండియా కంపెనీ ఇండియాతో వ్యాపారం చేసుకోవడానికి జహంగీరు చక్రవర్తి అనుమతి పొందాడు.

 

 

పట్టు, నీలిమందు, ప్రత్తి, తేయాకు ఇంకా నల్లమందు లాంటి రకరకాల వ్యవసాయ ఉత్పత్తులు ఈ ఎగుమతి, దిగుమతి వ్యాపారంలో ఉండేవి.

భారతదేశ పశ్చిమ తీరంలో వున్న సూరత్ రేవు నుండి మొదలైన ఈ వ్యాపారం తూర్పు తీరంలో వున్న మచిలీపట్నం  రేవు వరకూ విస్తరించింది. కాలం గడుస్తున్న కొలదీ ఇతర యూరోపియన్ దేశాల వర్తకులు కూడా ఇండియాతో వ్యాపారం మొదలు పెట్టడంతో ఈ దేశాల వర్తకుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు వచ్చేవి. ఈ నేపథ్యంలో ఇంగ్లీషు వర్తకులు తమ వ్యాపారాల రక్షణార్థం అక్కడి స్థానిక ప్రభుత్వాల అనుమతితో చిన్న చిన్న కోటలు కట్టుకోసాగారు.

జహంగీరు చక్రవర్తి మరణానంతరం, మొఘల్ సామ్రాజ్య పతనం మొదలైంది. పదుల, వందల సంఖ్యలో చిన్న చిన్న సంస్థానాలు స్వతంత్రం ప్రకటించుకుని తమ రాష్ట్రాలను తామే పరిపాలించుకోసాగారు. అవిచ్చిన్న భారతావని చిన్న చిన్న ముక్కలుగా విడిపోవడాన్ని, తమలో తాము కలహించుకోవడాన్ని నిశితంగా గమనించిన ఈస్టిండియా కంపెనీ వారు పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకున్నారు.

క్రీ.శ 1757లో అప్పట్లో ఇంగ్లాండు కన్నా చాలా సంపన్నమైన దేశంగా ప్రసిద్ధి పొందిన బెంగాల్ లో ఏర్పడ్డ రాజ కుటుంబంలోని వైరం ఇంగ్లీషు వాళ్ళకు అనుకోకుండా కలిసి వచ్చిన గొప్ప వరమైంది.

ఆనాడు బెంగాల్ నవాబుగా వున్న సిరాజుద్దౌలా కీ, ఆయన సైన్యాధిపతి మీర్ జాఫర్ కీ మధ్య విభేదాలు కల్పించి కుట్రచేయగలిగారు. ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించుకున్న చరిత్రలో మొదటిఘట్టం ఈ బెంగాల్ కుట్ర. "ప్లాసీ"యుద్ధంతో ఈస్టిండియా వారి సైన్య సహకారంతో మీర్ జాఫర్ నవాబ్ సిరాజౌద్దులా సైన్యాన్ని ఓడించి బెంగాల్ రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. ఈస్టిండియా వారి చేతిలో కీలుబొమ్మగా మాత్రమే తరువాతి కొద్దికాలం బెంగాల్ ని పాలించగలిగాడు.

1764లో "బక్సర్" లో జరిగిన యుద్ధంలో ఈస్టిండియా కంపెనీ వాళ్ళు మీర్ జాఫర్ కి బెంగాల్ రాజ్యాన్ని గెలిచిపెట్టారు. ఈ సంఘటనతో భారతదేశంలోని అత్యంత ధనవంతమైన బెంగాల్ రాష్ట్రం బ్రిటీషు వారి హస్తగతమయ్యింది. దేశంలోని పన్ను వసూళ్ళ బాధ్యత మొత్తం కంపెనీ వారికి ధారాదత్తం చేసేశాడు మీర్ జాఫర్.

మరో ఆరు సంవత్సరాల్లో ఈస్టిండియా కంపెనీ వాళ్ళు 1770 నాటికల్లా మరాఠాలను, మైసూరు మహారాజు టిప్పు సుల్తాన్ ను జయించి తమకీదేశంలో ఎదురులేదని నిరూపించారు. దాదాపు మొత్తం భారతదేశాన్ని హస్తగతం చేసేసుకున్నారు. 1803 నాటికి బ్రిటీషు ఈస్ట్ ఇండియా కంపెనీ దాదాపు రెండు లక్షల అరవై వేల మంది సైన్యంతో తిరుగులేని అధికారాన్ని స్థాపించుకుంది. ఏడాదికి, మొత్తం ఐరోపా దేశాలన్నింటినీ కలిపిన పన్ను రాబడి కన్నా కొన్ని వందల రెట్లు సుమారు పద్నాలుగు మిలియన్ పౌండ్లు పన్ను ఒక్క భారత దేశాన్నుంచే రాబట్టుకోసాగింది. చరిత్రలో ఎక్కడా కనీవినీ ఎరుగని రాక్షస విధానాలతో ఆంగ్ల ప్రభుత్వం పన్నులు వసూలు చేసేవారు.

1764 "బక్సర్" యుద్ధకాలం నుండి 1947లో స్వతంత్రం వచ్చే వరకు దాదాపు 30 కోట్ల మంది భారతీయులు కరవు కాటకాలతో మరణించారు.

1943లో ఒక్క బెంగాల్ లోనే 30 లక్షల మంది కరవు రక్కసి బారినపడి చనిపోయారు. అప్పటి బ్రిటీషు ప్రధానమంత్రి చర్చిల్ ఈ కరువుకాటకాలు చావుల గురించి ప్రస్తావిస్తూ ఇదంతా భారతీయులు చేసుకున్న ఖర్మ, మనమేం చేయగలం అని వ్యాఖ్యానించడం మొత్తం ప్రపంచాన్ని విభ్రాంతుల్ని చేసింది. వీళ్ళ జనాభా కుందేళ్ళ లాగా పెరిగిపోతుంటే మనమేం చేయగలం. ఏదో నాలుగ్గింజలు విదల్చగలం తప్ప. ఇండియాలో పండుతున్న ఆహారధాన్యాలన్నీ యూరప్ తదితర దేశాల్లో యుద్దాలు చేస్తున్న బ్రిటీషు సైన్యావసరాల కోసం ఎగుమతి చేయబడేవి.

సుమారుగా బ్రిటీషు వాళ్ళు ఇండియాతో వ్యాపారాలు మొదలుపెట్టిన కాలంలోనే కొన్ని ఇతర ఐరోపా దేశాలు కూడా ఇండియాతో వర్తకవ్యాపారాలు మొదలెట్టాయి. 1498లో పోర్చుగీసు వారు ఇండియాతో వర్తకం ప్రారంభించారు. "వాస్కో-డి-గామా" ప్రసిద్దిగాంచిన యూరోపియన్ నావికుడు తన ఓడలో ఆఫ్రికాఖండానికి దక్షిణపుటంచునవున్న"కేప్ ఆఫ్ గుడ్ హోప్" ప్రాంతాన్ని"నటాల్" (పోర్చుగీసు భాషలో క్రిస్టమస్ అని అర్ధం) గా నామకరణం చేశాడు. ఈ వాస్కోడిగామా బృందం దక్షిణ భారతం లోగల కేరళ రాజ్యంలోని "కాలికట్" చేరుకున్నారు. అక్కడి రాజు "సామూతిరి" ని దర్శించి వ్యాపారార్ధం ఆయన అనుమతిని పొందాడు.

1510 లో గోవాలో తమ మొట్టమొదటి వ్యాపార కేంద్రం స్థాపించుకున్నారు. ఆ తరువాతి కొద్దికాలంలోనే బొంబాయి, కేరళల్లో కూడా పోర్చుగీసు వారి వ్యాపారాలు మొదలైనాయి. అప్పట్లో జరిగిన పోర్చుగల్ యువరాణి "కేథరిన్", "ఇంగ్లాండు యువరాజు చార్లెస్ II"ల వివాహా సందర్భంలో పోర్చుగీసు వారు "బొంబాయి"ని ఇంగ్లీషు వాళ్ళకి వరకట్నంగా ఇచ్చేశారు. కాలక్రమంలో ఈ పోర్చుగీసు వాళ్ళు గోవా తప్ప తమ మిగిలిన వ్యాపార స్థావరాలను పోగొట్టుకున్నారు. 1947 ఇండియాకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా (1961 వరకూ అంటే సుమారు 450 సంవత్సరాలు) గోవా పైన వాళ్ళ పెత్తనం కొనసాగింది. ఆ రకంగా ఈనాటికీ గోవాలో పోర్చుగీసు భాష, సంస్కృతి, ఆహారపుటలవాట్లు చాలా వరకూ జీవించేవున్నాయి.

ఆంగ్లేయులు, పోర్చుగీసు వారి తర్వాత డచ్చి మరియు ఫ్రెంచి వ్యాపారులు కూడా ఇండియాతో వ్యాపారాలు మొదలెట్టారు.

క్రీ.శ 1602లో డచ్చి వారు "డచ్చి ఈస్ట్ ఇండియా" పేరుతో ఇండియాలో వ్యాపారాలు సాగించారు. భారతదేశంలోని తూర్పు వైపు సముద్రతీరం పొడుగునా మలబారు నుండి బెంగాల్ వరకూ తమ కార్యకలాపాలు సాగించారు. కానీ ఇండియాలో జహంగీరు తదనంతర కాలంలో జరిగిన రాజకీయ, సామాజిక సంక్షోభాల్ని తట్టుకోలేని డచ్చి వ్యాపారాలు క్రమంగా మూతబడ్డాయి. ఈ వ్యాపారులంతా వాళ్ళ వ్యాపారాల్ని "ఇండోనేషియా"దేశానికి తరలించుకున్నారు.

డచ్చి వారి తర్వాత ఫ్రెంచి వ్యాపారులు తమ వ్యాపారాలను ఇండియాలో కేంద్రీకృతం చేయసాగారు. దక్షిణ భారతదేశంలోని కోరమాండల్ తీరంలో వున్న పాండిచ్చేరిలో 1674లో తమ మొదటి వ్యాపార కేంద్రాన్ని నిర్మించుకున్నారు. 1688లో బెంగాల్ లోనూ, 1723లో ఆంధ్రదేశంలోని యానాంలోనూ తమ వ్యాపార కేంద్రాలను అభివృద్ధి చేయసాగారు. బెంగాల్ లోని "ప్లాసీ" వద్ద జరిగిన యుద్ధంలో బ్రిటీషు వారి చేతిలో ఓడిపోయాక క్రమంగా ఇండియాలో ఫ్రెంచి వారి బలం తగ్గిపోసాగింది. దక్షిణ భారతంలోని మైసూరు ప్రాంతంలో తమ వ్యాపారాలను కొద్దిగా అభివృద్ధి చేసుకోసాగారు. కానీ 1799లో అక్కడి పాలకులు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ లు ఇంగ్లీషు వారితో యుద్ధాలలో ఓడిపోయిన తర్వాత ఫ్రెంచి వారికి ఇండియాలో నిలువరించుకోగల సత్తాపోయింది.

ఒక్క పాండిచ్చేరి మినహా భారతదేశంలో ఇంకెక్కడా వారు కుదురుకోలేక ఇండియానుండి జెండా ఎత్తేసారు. కాని నేటికీ పాండిచ్చేరిలో వారి భవన నిర్మాణ కౌశలం, రహదారుల నిర్మాణం, వగైరాలు వారి సంస్కృతిని తెలియజేస్తూ నిలిచేవున్నాయి.

యూరప్ నుండి ఎన్ని దేశాలు ఇండియా వచ్చినా ఎక్కువ కాలం నిలబడలేకపోయాయి. (బ్రిటీషు వాళ్ళు మాత్రం క్రీ.శ 1600 నుండి 1947 వరకు ఇండియాలో నిలువగలిగారు.1857 సిపాయీల విప్లవం (మొదటి స్వాతంత్ర్య సమరంగా చరిత్రకారులు పేర్కొన్నారు) తర్వాత బ్రిటీషు ప్రభుత్వం ఈస్టిండియా కంపెనీ నుండి భారతదేశపు పరిపాలనా పగ్గాలు స్వాధీనపరచుకున్నారు. 1857 నుండి 1947 వరకు (ఇండియాకు సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చే వరకు) బ్రిటీషు రాజులు ఇండియాను పరిపాలించారు.

ఈ అస్థిరకాలంలో (క్రీ.శ 1600 నుండి 1947) ఇండియాలో 175 స్వతంత్ర రాష్ట్రాలు (హైద్రాబాద్, గ్వాలియర్, బరోడా, మైసూరు, తిరువాన్కూరు, పాటియాల ఇంకా జైపూరు లాంటి సంస్థానాలు) కాక మరో 400 చాలా చిన్న రాష్ట్రాలు అక్కడి రాజకుటుంబాల పాలనలో ఉండేవి. వారిలో వారికి కలహాలు తగవులు జరగడం కద్దు. అయినా ఎంతో పెద్ద సైన్య బలంతో దేశం మొత్తాన్ని పరిపాలించే ఇంగ్లీషు ప్రభుత్వానికి వీరంతా సామంత రాజ్యాలుగా కప్పం కట్టేవారు.

ఈ కాలంలో ఈ చిన్న చిన్న రాజులంతా ఇంగ్లీషు వాళ్ళ వేషభాషలకు, సంస్కృతికి దాసులైపోయారు. తమ తమ పిల్లలను ఉన్నత విద్య పేరిట యూరప్, ఇంగ్లాండులకి పంపించడం ఒక స్థాయీ, హోదాగా మారిపోయింది. వారు సెలవులకనీ, విశ్రాంతికనీ కుటుంబాలతో సహా అక్కడకు వెళ్ళడం ఒక దర్జా అయిపోయింది. చాలా సందర్భాలలో ఈ సంస్థానీకులకు సమయానికి డబ్బు చేతికందని సందర్భాలలో (నూటికి తొంభై సందర్భాలు ఇలాగే వుండేవి). బ్రిటీషు ప్రభుత్వం ఎంతడబ్బైనా ఋణంగా ఈ రాజులకిచ్చేది. దీనికి ప్రతిగా పన్నుల వసూళ్ళు అక్కడక్కడా ప్రభుత్వ యాంత్రాంగాన్ని నడిపే అధికారమూ ఆంగ్లేయుల చేతికి వచ్చేసేది. రాజులంతా నామమాత్రానికే పాలకులుగా అయిపోయారు. 

 

* * *