Print

సౌత్ ఆఫ్రికా లో గాంధీజీ

 

 

జనవరి 30  1948 మహాత్మాగాంధీ హత్యగావింపబడ్డ రోజు.

భారతదేశానికి బ్రిటీషు వాళ్ళ పాలన నుండి స్వాతంత్య్రం వచ్చి కనీసం అయిదు నెలలు కూడా కాలేదు. ఒక మత ఛాందసవాది చేతిలో భారతదేశ రాజధాని ఢిల్లీలో ఉదయం ఆయన ప్రార్ధనా సమయంలో శాంతిదూత గాంధీజీ హత్యగావింపబడ్డారన్న వార్త యావత్ప్రపంచాన్ని దిగ్భ్రాంతి పరచింది. జాతిపితగా దేశం సన్మానించే మహాత్మాగాంధీ ఇకలేరన్న వార్త మొత్తం భారతజాతిని  శోకసముద్రంలో ముంచేసింది. ప్రపంచమంతా రకరకాల మారణాయుధాలతో చంపుకుంటున్న వేళ "సత్యాగ్రహాన్నే" ఆయుధంగా ఎంచుకుని సూర్యుడస్తమించని బ్రిటీషు వారి సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఆయన పోరాట స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో కోట్లాది మందికి మార్గదర్శకమైంది. నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ ఇంకా బరాక్ ఒబామా లాంటి తరువాతి తరాలవారికి స్ఫూర్తిదాయకమైంది. గాంధీగారి మరణవార్తవిని మా ముత్తాత వీరయ్య ఎంత దుఃఖపడ్డారో, అన్న విశేషాల్ని వివరిస్తున్నప్పుడు మా నాయనమ్మ నాంచేరమ్మ కళ్ళవెంట బాష్పాలు కారుతుంటే నేను అవాక్కయిపోయి ఆమెను కనీసం ఓదార్చలేకపోయాను. గాంధీగారి మరణవార్త విన్నరోజు భారతదేశంలోని లక్షలాది గ్రామాల్లో ఒక ఇంట్లో కూడా "పొయ్యిలో నుంచి పిల్లి" లేవలేదని చెబుతారు.

గుజరాత్ రాష్ట్రంలోని ఒకప్పటి కథియవార్ సంస్థానంలో రాజోద్యోగిగా పనిచేసిన "కాబాగాంధీ, పుత్లిబాయి దంపతులకు చివరి సంతానంగా 1869 అక్టోబరు 2 న పోర్బందరులో జన్మించాడు మోహన్దాస్ కరమ్ చంద్ గాంధీ.

ఆనాటి సామాజిక వ్యవస్థ సంప్రదాయాలననుసరించి పదమూడు సంవత్సరాల వయసులోనే గాంధీ కస్తూర్భాను వివాహం చేసుకున్నారు. మెట్రిక్యులేషన్ పాసయిన తర్వాత ఆయనను న్యాయశాస్త్రం  చదవటానికి ఇంగ్లండు పంపించడానికి తండ్రి కాబా గాంధీ నిర్ణయించారు.

ఆరోజుల్లోనే ఇంగ్లండు వెళ్ళి "లా" చదవడానికి కనీసం ఐదువేల రూపాయలు ఖర్చయ్యేది. కొంచెం కష్టమే అయినా మోహన్దాస్ ని ఇంగ్లండు పంపడానికే తండ్రి నిశ్చయించుకున్నారు. కాని, అప్పటి ఛాందసవాదం , ఆచార, సంప్రదాయాలకు విరుద్ధం. అందువల్ల తల్లి పుత్లిబాయి మాత్రం ఒప్పుకోలేదు, కానీ అందరూ కలిసి ఆమెకు నచ్చచెప్పిన తర్వాత ఆమె "మద్యం తాగననీ, మాంసాహారం, మగువల జోలికి పోననీ" ఇంకా రోజూ పూజావిధులూ వగైరా నిర్వహిస్తాననీ" గాంధీ చేత ఒట్టు వేయించుకుని కొడుకుని ఇంగ్లండు వెళ్ళడానికి అనుమతించారు.

క్రి.శ. 1888 లో గాంధీ తన పంతొమ్మిదవ ఏట, వయసులో వున్న భార్య కస్తూరిబాయిని విడిచి ఇంగ్లండు వెళ్ళాడు.

   

క్రీ.శ. 1888లో ఇంగ్లాండులో యువ లాయరుగా గాంధీ

సేకరణ: గాంధీ లుథిలీ డాక్యుమెంటేషన్ సెంటర్

ఇంగ్లీషు వారి జీవన విధానం, విక్టోరియన్ సభ్యత గాంధీకి బాగానే నచ్చాయి. ఆంగ్లేయుల సభ్యత, పద్ధతుల్ని అనుకరించడానికి ప్రయత్నించేవాడు. 1891లో లండన్ లో బార్-ఎట్-లా పరీక్షలు పాసయ్యి బారిష్టరుగా ఇండియాకి తిరిగి వచ్చేశాడు. కానీ ఇక్కడ ఆయన లాయర్ సరిగా సాగలేదు. నేరస్థులు వచ్చి తమవైపు వాదించమని, తమని ఆకేసు నుండి తప్పించమనీ, ఎంత ఫీజైనా భరిస్తామనీ అడిగేవారు. కాని దానికి గాంధీ ఇష్టపడేవాడు కాదు. నేరం చేయడం తప్పనీ, పోలీసులకు లొంగి పోవాల్సిందిగా తన దగ్గరకు వచ్చిన క్లయింటులకు నచ్చజెప్పచూసేవాడు, మందలించేవాడు. కొద్దికాలంలోనే గాంధీ న్యాయవాదవృత్తి చాలా మందకొడిగా నడవసాగింది. తన కుటుంబాన్నీ, భార్యాపిల్లల్నీ పోషించుకోవటానికి చాలా ఇబ్బందిపడసాగాడు.

 సరిగ్గా ఈ సమయంలోనే 1893లో సౌతాఫ్రికాలో వ్యాపారాలున్న ఒక ధనిక వ్యాపారి సౌతాఫ్రికాలో తన వ్యాపారాలకు సంబంధించిన కొన్ని వ్యాజ్యాలను సౌతాఫ్రికా కోర్టుల్లో వాదించవలిసిందిగా గాంధీని కోరాడు. గాంధీ అన్న గారి స్నేహితుడు సేఠ్ అబ్దుల్  కరీం ఝవేరీ (దాదా అబ్దుల్లా అండ్ కంపెనీ యజమాని) సౌతాఫ్రికాలో తన కేసులు వాదించినందుకు గాను సంవత్సరానికి  105పౌండ్ల ఫీజు చెల్లించగలననీ, పై  ఖర్చులూ, ఇండియా నుండి సౌతాఫ్రికా వరకూ ప్రయాణాలకయ్యే మొత్తం ఖర్చులూ, ఫస్ట్ క్లాసు టిక్కెట్లు తానే భరించడానికి అంగీకరించి గాంధీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఆరోజుల్లో 105 పౌండ్లంటే ఒక రాజభరణం క్రిందే లెక్క. సౌతాఫ్రికాలో దాదా అబ్దుల్లా కంపెనీతో కోర్టుల్లో వ్యాజ్యం నడుస్తున్న కంపెనీ యజమాని "తయ్యబ్ సేఠ్" (ఆయన కూడా భారత సంతతికి చెందిన వాడే) గాంధీకి ఈ వ్యాపార సంబంధమైన కిటుకులూ, లావాదేవీలు పెద్దగా తెలియకపోవడం వల్ల తాను ఈకేసు వాదించడానికి, సముఖత చూపలేదు. కానీ అన్నగారు నచ్చజెప్పడంతో చివరకు సౌతాఫ్రికా వెళ్ళడానికి అంగీకరించాడు. భార్యనూ, సంతానాన్నీ ఇండియాలోనే వదిలి తన భవిష్యత్తును వెదుక్కుంటూ సౌతాఫ్రికాకి ఓడెక్కాడు గాంధీ.

1893 ఏప్రిల్ నెలలో బొంబాయి నుండి సౌతాఫ్రికా, ఒక కోర్టు కేసు నిమిత్తం ఇరవై నాలుగు సంవత్సరాల గాంధీ తన “గమ్యం” కనీసం కలలో కూడా ఊహించివుండడు. ఎక్కడి వకీలు "గాంధీ" ఎక్కడి "మహాత్మాగాంధీ"! అహింస అనే అంతకుముందు ఎవరూ కనీసం కనీవినీ ఎరుగని ఆయధంతో సూర్యుడస్తమించని బ్రిటీషు సామ్రాజ్యాన్ని గడగడలాడించి భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సముపార్జించి పెట్టిన చరిత్ర ఇది.

కొన్ని వారాలు ఓడ ప్రయాణం చేసి "మే" నెలాఖరులో నాటాల్ చేరుకున్నాడు గాంధీ. మన కథానాయకుడు వీరయ్య తన ఓడ ప్రయాణంలో పడ్డ పాట్లన్నీఏ మాత్రం తెలియని గాంధీ ప్రయాణం "ఫస్ట్ క్లాస్" లో దర్జాగా సాగింది. ప్రయాణం మొదలవ్వగానే ఓడను నడిపే "క్యాప్టెన్" ను పరిచయం చేసుకున్నాడు. మాంసాహారాన్ని ముట్టుకోని గాంధీకి క్యాప్టెన్ ప్రత్యేకంగా శాకాహారపు భోజనం వగైరా వసతులు తన పర్యవేక్షణలో అందేలా చూసేవాడు. ప్రయాణంలో సమయం దొరికినప్పుడల్లా క్యాప్టెన్ తో తనకు బాగా ఇష్టమైన చదరంగం "చెస్" ఆడుతూ గడిపాడు. ఓడలో ప్రయాణిస్తున్న ఇతర ఫస్ట్ క్లాస్ ప్రయాణీకులను పరిచయం చేసుకుని వారితో సరదాగా గడుపుతూ సాగించాడు తన ప్రయాణాన్ని. సాధ్యమైనంత వరకూ ఓడలో ప్రయాణిస్తున్న కూలీ నాలీ జనాలకు దూరంగా తిరిగేవాడు. వాళ్ళ అపరిశుభ్రమైన అలవాట్లూ, పద్ధతులూ, వాళ్ళుపయోగించే ముతక భాష గాంధీకి ఏమాత్రం నచ్చేది కాదు.  ఇంగ్లీషు వాళ్ళ దొరల పద్ధతులూ,వాళ్ళ జీవన విధానం బాగా అలవాటు పడిన గాంధీకి ఈ కటిక దరిద్రంలో బ్రతుకుతున్న భారతీయ కూలీల పరిస్థితి ఏమాత్రం అర్ధం కాలేదు.

ఓడ సౌతాఫ్రికా "డర్బను" నగరానికి చేరేటప్పటికి అక్కడి (దాదా అబ్దుల్లా అండ్ కంపెనీ యజమాని- అబ్దుల్ కరీమ్ ఝవేరీ) మనుషులు గాంధీని సగౌరవంగా ఆహ్వానించి ఆయన విశ్రాంతికి సకలమైన ఏర్పాట్లు చేసి వుంచారు. కొద్దిరోజుల విశ్రాంతి తర్వాత ఆయన కేసు వాదించడానికి గాను "పీటర్ మారిట్జ్ బర్గ్" వెళ్ళవలసి వుంది.

1893 జూన్ నెల 7వ తారీఖు నాడు గాంధీ డర్బన్ నుండి ప్రిటోరియాలోని చార్లెస్ టౌన్ అనే నగరానికి రైలులో ప్రయాణమయ్యాడు. ఝవేరీ అండ్ కంపెనీ ఉద్యోగి ఒకరు గాంధీని రైలెక్కించడానికి స్టేషన్ కి వచ్చి థర్డ్ క్లాస్  టికెట్ కొని గాంధీ చేతికందించాడు. ఆ థర్డ్ క్లాస్ టికెట్ చూసిన గాంధీ కంపెనీ ఉద్యోగి మీద మండిపడ్డాడు. నేను ఫస్ట్ క్లాస్ కంపార్టుమెంట్లో మాత్రమే ప్రయాణం చేస్తాను. వెళ్ళి టికెట్ మార్పించుకు రమ్మని ఆదేశించాడు. దానికా ఉద్యోగి అయ్యా! మీకు తెలిసినట్లు లేదు, ఇక్కడ సౌతాఫ్రికాలో ఇండియన్లెవరూ రైలులో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించడానికి వీలు లేదు. అందరూ థర్డ్ క్లాస్ లో మాత్రమే ప్రయాణించాలి అని ఎంత నచ్చ చెప్పినా గాంధీ వినిపించుకోలేదు. ఇక లాభం లేదని గాంధీ స్వయంగా తానే టికెట్లిచ్చే కిటికీ దగ్గరకు వెళ్ళి అక్కడ కూర్చున్న గుమస్తాకి తను ఇంగ్లాండులో చదువుకున్న బారిష్టరు సర్టిఫికేటు చూపించి ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కున్నాడు. కానీ గాంధీకి తెలియని విషయం ఏమిటంటే 1888లో అక్కడి ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం ఇండియన్లెవరూ రైలులో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించడాని వీలు లేదు. ఎవరైనా తెల్లదొర దగ్గర నౌకరుగా పనిచేస్తున్న ఇండియన్ మాత్రమే ఫస్ట్ క్లాస్ ఎక్కడానికి వీలుంటుంది.

రైలెక్కిన తర్వాత ఫస్ట్ క్లాస్ రైలు పెట్టెలో సహాయకునిగా పనిచేస్తున్న ఒక ఆఫ్రికన్ జాతీయుడు గాంధీని ఫస్ట్ క్లాస్ లో కూర్చోబెట్టడానికి ఒప్పుకోలేదు. కొంచెం చిరాకు పడ్డాడు గాంధీ, ఏమిటిదంతా? ఇక్కడేదో (ప్రతిదీ కాస్త విచిత్రంగా కనిపిస్తున్నదీ, అనుకున్నాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో రైలు "పీటర్ మారిట్జ్ బర్గ్" స్టేషన్ చేరుకుంది. అప్పటికి ఈ విషయం తెలుసుకున్న రైలులోని "టికెట్ కలెక్టర్" హుటాహుటిన గాంధీ కూర్చున్న కంపార్టుమెంటులోనికి (పెట్టెలోకి) పరుగెత్తుకొచ్చాడు.

గాంధీని ఎగాదిగా చూస్తూ నువ్విక్కడ కూర్చోకూడదు. థర్డ్ క్లాస్ (మూడవ తరగతి పెట్టె లోకి) వెళ్ళి కూర్చోమని గట్టిగా అరిచాడు. దానికి గాంధీ, నేను ఫస్ట్ క్లాస్ టికెట్ కొన్నాను. నేనెందుకు కదలాలి? నేను వేరే కంపార్టుమెంటు కి వెళ్ళను. నేనిక్కడే కూర్చుంటాను అని చాలా మర్యాదగా చెప్పాడు. కాని గాంధీ చెప్పినదేమీ వినిపించుకోకుండా ఆ టిక్కట్టు కలెక్టరు పోలీసు కానిస్టేబుల్ ని పిలిచి వ్యవహారమంతా ఫిర్యాదు చేశాడు. మరోమాట లేకుండా ఆ పోలీసు గాంధీ సామాన్లు  ప్లాట్ఫారం  మీదకు విసిరేసి, గాంధీని కూడా ప్లాట్ ఫారం మీదకు తోసేశాడు.

అసలిక్కడ ఏం జరుగుతుందో అర్ధం కాక విపరీతమైన కోపంతో స్టేషన్ మాస్టర్ ఆఫీసులోకి వెళ్ళి విషయమంతా చెప్పి ఫిర్యాదు చేశాడు గాంధీ. తానొక లండన్ లో చదువుకున్న బారిష్టరుననీ, తన వద్ద ఫస్ట్ క్లాస్ టికెట్ వున్నా చాలా అవమానకరంగా ప్రవర్తిస్తూ తనను బయటికి తోసేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను ఫస్ట్ క్లాస్ లో తప్ప వేరే క్లాస్ పెట్టెలో ప్రయాణించబోననీ కూడా ఆ ఫిర్యాదులో వ్రాశాడు.

స్టేషన్ మాస్టర్ గదిలో నుండి బయటికి వచ్చేసరికి తను ప్రయాణించిన రైలు వెళ్ళిపోయింది. అప్పటికే చాలా చీకటి పడిపోయింది. తర్వాతి రైలు మరునాడు ఉదయం వరకూ లేదని తెలిసి ఏం చెయ్యాలో తోచక వెళ్ళి వెయిటింగ్ రూమ్ లో వణుకుతూ కూర్చున్నాడు. బాగా చల్లగా వుంది. రాత్రి బాగా పొద్దుపోయింది. ఇదేమిటి? ఇక్కడకు రాగానే ఇట్లా జరిగింది, జరిగిన అవమానాన్ని భరిస్తూ ఇక్కడే వుండాలా? లేక తిరిగి ఇండియా వెళ్ళిపోదామా? ఈ ప్రయాణాన్ని ఇక్కడితో ఆపి వెనక్కి ప్రిటోరియా వెళ్తే ఎలా వుంటుంది? కాస్సేపటికి కునుకు పట్టింది. తన ఆలోచనల్లో గాంధీ ఆ రాత్రి తీసుకున్న నిర్ణయం మరో విధంగా వుంటే చరిత్ర గతిమారిపోయివుండేది. ఏదేమైనా సరే తన హక్కు కోసం అన్యాయానికి ఎదురు పోరాడడానికి నిర్ణయం తీసుకున్నాడు చివరకు.

మరునాడు ప్రొద్దున్నే వచ్చిన మరో రైలులోకెక్కి తన ప్రయాణం కొనసాగించాడు. ఈసారి ప్రయాణంలో ఏ సమస్యా లేకుండా ప్రిటోరియా చేరుకున్నాడు.

ఇక ఇక్కడకు వచ్చిన పని కోర్టులో ఇద్దరు ధనిక వ్యాపారుల మధ్య తగాదా! విశేషమేమిటంటే ఇద్దరు వ్యాపారులూ భారతీయులే! ఆశ్చర్యమేమిటంటే వీరిద్దరూ "అబ్దుల్లా సేఠ్" ఇంకా "తైయబ్ సేఠ్" లు బంధువులు కూడాను. అంతేకాక ఇద్దరూ వ్యాపారంలో భాగస్తులు, ఇద్దరూ కోటీశ్వరులే!

అబ్దుల్లా డర్బనులోనూ తైయబ్ ప్రిటోరియాలోనూ నివసించేవారు ప్రస్తుత తగాదా ఏమిటంటే తైయబ్ సేఠ్, అబ్దుల్లా సేఠ్ కి 40వేల పౌండ్లు బాకీ క్రింద ఇవ్వవలసిరావడం! ఆరోజుల్లో 40వేల పౌండ్లంటే చాలా పెద్ద మొత్తం. ఇద్దరి మధ్యా రకరకాల వ్యాపారాలు నడుస్తుండేవి. వేలకొద్దీ పౌండ్ల వ్యాపారం జరుగుతుండేది. కానీ ఈ సందర్భంలో ఇద్దరి మధ్యా విభేదాలు రావడంతో కోర్టుకెక్కారు. ఇద్దరూ సౌతాఫ్రికాలోని స్థానిక వకీళ్ళ ద్వారా వ్యవహారం పరిష్కారం కోసం ప్రయత్నించారు. కానీ కుదరలేదు.

ఇక్కడ చేయగల వ్యాపారావకాశాల గురించి విని ఈ ఇద్దరూ 1860 ప్రాంతంలో సౌతాఫ్రికా చేరుకున్నారు. ఇండెంచర్ కూలీల లాగా కాక వీరు తమ ఓడ ప్రయాణానికయ్యే ఖర్చు తామే భరించి "ఫ్రీ" ఇండియన్లుగా సౌతాఫ్రికా చేరుకున్నారు. ఇండియాలో వాళ్ళకున్న వ్యాపార సంబంధాలతో ఇక్కడ బియ్యం, బట్టలూ, సుగంధద్రవ్యాలూ, బంగారం లాంటి సరుకులతో వ్యాపారాలు ప్రారంభించారు. ఇండియాలో మూలాలున్న వీరు ఇక్కడి స్థానిక తెల్ల వ్యాపారుల కన్నా ఎక్కువ లాభసాటిగా వ్యాపారం చేయగలిగారు. కొద్దికాలంలోనే కోట్లు గడించి స్థిరపడిపోయారు.

ఈ అబ్దుల్లా కంపెనీ వివరాల కోసం గాంధీ స్వయంగా ఈ రెండు కంపెనీల ఆఫీసులకూ, గిడ్డంగులకూ ఇతర వ్యాపార స్థలాలకూ వెళ్ళవలసి వచ్చింది. ఆయన వెళ్ళిన చోట్లలో పనిచేస్తున్న ఇండియన్ ఆఫ్రికన్ కూలీలు, పనివాళ్ళు నివసిస్తున్న హీన పరిస్థితులూ, అశుభ్రత, దుర్భర దారిద్ర్యమూ చూసి చలించి పోయాడు గాంధీ. ప్రిటోరియాలో తన మొట్టమొదటి సమావేశంలోనే ఇక్కడి భారతీయుల దుర్భర జీవన పరిస్థితులు గురించి చర్చించసాగాడు. పరిశుభ్రమైన వాతావరణం, శుచీశుభ్రతా, తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోలేని వారు తమ హక్కులకోసం మాత్రం ఎలా పోరాడగలరు?

అబ్దుల్లా సేఠ్, తైయబ్ సేఠ్ ల వ్యవహారానికి సంబంధించి, రాత్రింబగళ్ళు చాలా శ్రమించవలసి వచ్చింది గాంధీకి. కోర్టుల్లో కాకుండా కోర్టు బయటే వ్యవహారం పరిష్కారం చేసుకోవడానికి ఇద్దరు సేఠ్ లనూ ఒప్పించగలిగాడు. ఒక్కసారిగా కాకుండా దఫదఫాలుగా చిన్న మొత్తాలతో తయ్యబ్ సేఠ్ 37వేల పౌండ్లు అబ్దుల్లా సేఠ్ కి చెల్లించే విధంగా సమస్య పరిష్కారమైపోయింది. ఈ సంఘటనతో ఈ ఇద్దరు వ్యాపారుల సంబంధాలు పునరుద్దరించబడటం ఒక ఎత్తయితే, సౌతాఫ్రికాలో నివసిస్తున్న మొత్తం ఇండియన్ల దృష్టిలో గాంధీ పేరు చాలా గొప్పగా గౌరవనీయమైన స్థాయికి ఎదిగిపోయింది.

తాను సౌతాఫ్రికా వచ్చిన పని (అబ్దుల్లా తయ్యబ్ ల కేసు) అయిపోయింది. కనుక తిరిగి ఇండియా వెళ్ళిపోవడానికి సన్నాహాలు ప్రారంభించాడు గాంధీ. కాని తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తాడు అన్నట్లు గాంధీకి అబ్దుల్లా, తయ్యబ్ లు 1894లో డర్బన్ లో ఏర్పాటు చేసిన వీడ్కోలు-విందు-సమావేశం లో గాంధీకి "ఇండియన్ ఫ్రాంచైజ్ యాక్ట్" గురించి తెలిసింది. సౌతాఫ్రికా ప్రభుత్వం త్వరలోనే ఈ "ఇండియన్ ఫ్రాంచైజ్ యాక్ట్" అమలు పర్చబోతున్నది. దాని వల్ల ఇండియన్లు ఓటు వేసే హక్కు కోల్పోతారు. ఇండియన్లకు స్వతంత్రంగా ఏ విధమైన సమాజపరమైన గుర్తింపూ ఉండదు. అంటే ఇండియన్లు స్వతంత్రంగా ఏ విధమైన వ్యాపార వ్యవహారాలూ చేసుకోవడానికి వీలుండదు. కనీసం ప్రభుత్వమిచ్చే "పాస్"  లేకుండా వీధిలోనికి వెళ్ళడానికి కూడా వీలుండదు. ఈ వార్త విని గాంధీ ఆశ్చర్యపోయాడు. భారత వ్యాపారులంతా గాంధీని ఇంకాకొంత కాలం ఇక్కడే వుండి ఈ వ్యవహారాన్ని పరిష్కరించవలసిందిగా కోరారు. వారి అభ్యర్ధనను మన్నించి గాంధీ తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు. ఈ ఫ్రాంచైజ్ యాక్ట్ విషయంగా సౌతాఫ్రికా ప్రభుత్వంతో చర్చించి ఒక న్యాయమైన విధానం కోసం ప్రయతించదలచుకున్నాడు. దీనికోసం నటాల్ లో అక్కడి మిత్రులతో కలసి 1894లో "నటాల్ ఇండియన్ కాంగ్రెస్" కి శ్రీకారం చుట్టాడు.

దీనికోసం ప్రభుత్వంతో పోరాడేందుకు "అహింసా పోరాట పద్దతిని" అనుసరించడానికి నిశ్చయించారు. ఈ ప్రపంచంలో మొదటిసారిగా ఆయుధాలు చేత బట్టకుండా నియంతృత్వ పోకడలతో పోరాటానికి "సత్యాగ్రహం"  అనే ఆయుధంతో పోరాడడానికి సౌతాఫ్రికా భారతీయుల్ని ఉత్తేజపర్చాడు. తరువాతి దశాబ్దాలలో ఈ సత్యాగ్రహ విధానమే భారతదేశానికి ఆంగ్లేయులనుండి స్వేచ్చా స్వాతంత్ర్యాలను సంపాదించిపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా గాంధీకి అభిమానుల్ని సమకూర్చింది.

మరోవైపు భారతీయ వ్యాపారుల నుండి స్థానిక ఇంగ్లీషు వ్యాపారులకు చాలా గట్టి పోటీ ఏర్పడసాగింది. ఇండియన్ వ్యాపారులు తక్కువ ధరలకు సరకులు అమ్మేవారు. ఇరవైనాలుగుగంటలూ శ్రమించేవారు. ఇండెంచర్ కాలపరిమితిని పూర్తి చేసుకున్న కూలీలు కొంతమంది బజారులో తమ స్వంతంగా చిన్న చిన్న వ్యాపారాలు చేయసాగారు. రకరకాల కూరగాయలు, పండ్లు తామే స్వంతంగా పండించి సరసమైన ధరలకే బజారులో అమ్మకాలు చేయసాగారు.

ఇంగ్లీషు వ్యాపారులూ, రైతులూ తెల్ల దొరల ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చి భారతీయ వ్యాపారులను ఇబ్బందికరమైన పరిస్థితులకు గురిచేయసాగారు. వారిమీద రకరకాల సుంకాలు విధించడం, వ్యాపార పరిమితుల రూల్సు, ప్రభుత్వ నిబంధలను అవినీతికరమైన పద్ధతుల్లో అమలుపర్చడం లాంటివి చేయసాగారు. ఉదాహరణకు భారతీయ చిన్న వ్యాపారులు తమ తమ వస్తువుల అమ్మకాలను ఉదయం తొమ్మిది గంటల కల్లా ముగించేసుకోవాలి లాంటివి.

ఇంగ్లీషు వాళ్ళు అనుసరించిన విపరీత విధానాల్లో ఒకటి : కూలీలెవరైనా సరే "ఇండెంచర్ కాలపరిమితి" పూర్తి చేసుకున్న వాళ్ళు ఇండియాకు తిరిగి వెళ్ళిపోవాలి లేదా మళ్ళీ మళ్ళీ ప్రతి రెండు సంవత్సరాలకు తమ యజమానులతో కొత్తగా కాంట్రాక్టు ఒప్పందం మీద సంతకాలు చేసి కూలీలుగానే జీవించాలి. ఈ విధానాన్ని పాటించకుండా తాము స్వంతంగా వ్యాపారాలు చేసుకోదలచుకున్నవాళ్ళు ఏడాదికి 25 పౌండ్లు "పన్ను" కట్టవలసివుంటుంది.

ఇది విన్న గాంధీకి చాలా ఆశ్చర్యం కలిగింది. ప్రపంచంలో ఎక్కడా లేని ఈ విధానాలను ఖండించడానికీ, ఎదుర్కోవడానికీ నిశ్చయించుకున్నారు. మూడు పౌండ్ల శిస్తు కట్టడమే భారంగా వున్న చిన్న వ్యాపారులు 25పౌండ్లు పన్ను కట్టడం సాధ్యం కాదు. ఈ చట్టానికి వ్యతిరేకంగా "నటాల్ ఇండియన్ కాంగ్రెసు" ఆధ్వర్యంలో సౌతాఫ్రికా అంతటా సమ్మెలూ, అహింసాయుత పోరాటాలు చేయడానికి నిర్ణయించుకున్నారు.

కొద్దికాలంలోనే గాంధీని సౌతాఫ్రికాలోని భారతీయులు "అన్నా" గాంధీభాయ్ అని ఆప్యాయంగా పిలవసాగారు. రోజురోజుకీ గాంధీకి పెరుగుతున్న ప్రజాదరణ ఇంగ్లీషు వారికి కంటకంగా మారసాగింది. ఈ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను నిరసిస్తూ, "భారతీయులకు సమానహక్కులు" కావాలి అనే నినాదంతో పెద్ద ఎత్తున పోరాటం మొదలైంది. భారతీయులందరికీ ఈ పోరాటానికి ఉద్యమించడానికీ, ఉత్సాహం కలిగించడానికీ గాంధీ "ఇండియన్ ఒపీనియన్" అనే పత్రిక ప్రచురించ సాగాడు.

పత్రికలో ఏ రోజుకారోజు భారతీయులనుభవిస్తున్న దుర్భరమైన రోజువారీ జీవితాలనూ, ఆరోగ్య పరిస్థితులనూ, పొలాల్లో, ఫ్యాక్టరీలలో జరుగుతున్న అక్రమాలనూ ప్రచురించసాగారు.

1904లో జోహన్స్ బర్గ్ ప్రాంతంలో "ప్లేగు" వ్యాధి వ్యాపించి ఎంతో మంది చనిపోయారు. దుర్గంధభరితమైన మురికివాడల్లో నివసిస్తున్న ఎంతో మంది భారతీయులు మృత్యువాతపడ్డారు. ఇలాంటి ప్లేగులాంటి రోగాలకూ, జబ్బులకూ భరించలేనంత దుర్భరమైన కుళ్ళు నివాసాలలో నివసిస్తున్న భారతీయులకు సరైన ఆరోగ్యకరమైన నివాస సౌకర్యాలను అందించడంలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వ  వ్యవస్థను తన “ఇండియన్ ఒపీనియన్” పత్రికలో దుయ్యబట్టారు గాంధీ. తనవంతుగా చిన్న చిన్న ప్రాధమిక చికిత్సా కేంద్రాలను ఏర్పరచి కొంతమంది మిత్రులతో కలిసి రోగాలతో బాధపడుతున్న వారికి వీలైనంత సేవ చేయసాగారు.

ఈ ఇండియన్ ఒపీనియన్ లో వస్తున్నవార్తల్ని, ఆయన వ్యక్తిత్వాన్ని, మానవతావాదాన్ని గమనించిన హెన్రీ పొలాక్ అనే యూదుమతస్తుడైన ఒక సంపన్నుడు గాంధీని కలిసి ఆయన విధానాలకు తన మద్దతు తెలిపాడు. ఆయన చేస్తున్న కార్యక్రమాలలో చేదోడు వాదోడుగా నిలబడి అవసరమైన సాయం చేయసాగాడు. గాంధీ జీవితంలో ఒక మంచి మిత్రుడుగా చరిత్రలో నిలిచిపోయాడు.

1904లో ఒకసారి గాంధీ డర్బాను వెళ్ళడానికి జోహన్స్ బర్గ్ లో రైలు ఎక్కబోతుండగా ఆయనకు వీడ్కోలు చెప్పడానికి వచ్చిన 'పొలాక్' అని ప్రఖ్యాత తత్వవేత్త, రచయిత జాన్ రస్కిన్ వ్రాసిన “అన్ టు ధిస్ లాస్ట్” పుస్తకాన్ని బహూకరించాడు. గాంధీ తన జీవిత చరిత్ర లో ఈ పుస్తకం తన జీవిత విధానాన్నే మార్చివేసిందని వ్రాసుకున్నాడు. జోహన్స్ బర్గ్ నుండి డర్బను వరకూ చేసిన 24గంటల ప్రయాణంలో ఈ పుస్తకాన్ని పూర్తిగా చదివేసిన గాంధీ, డర్బను చేరాక, ఇకనుండి తన జీవన ప్రయాణాన్ని ఈ పుస్తకం నుండి నేర్చుకున్న ఆదర్శాలను అనుసరించి సాగించటానికి నిశ్చయించుకున్నాడు. తరువాతి రోజుల్లో, 1908లో ఆయన ఈ "అన్ టు దిస్ లాస్ట్" పుస్తకాన్ని గుజరాతీ భాషలోనికి అనువదించి "సర్వోదయ" పేరుతో ప్రచురించాడు.

లియో టాల్స్టాయ్ వ్రాసిన "కింగ్ డమ్ ఆఫ్ గాడ్ విధిన్ యు" పుస్తకం కూడా గాంధీజీ జీవితంపైన గొప్ప ముద్రవేసింది.

డర్బన్ లో కలిసిన మరో శ్వేతజాతీయుడు "ఆల్బర్ట్ హెచ్ వెస్ట్", కూడా గాంధీకి చాలా సన్నిహిత మిత్రుడుగా మారాడు. గాంధీ ఈ వెస్ట్ గారితో కలిసి సౌతాఫ్రికాలోని ప్రవాస భారతీయులకు సమాన హక్కులు సాధించే దిశగా చేసే ప్రయత్నాలలో భాగంగా ఒక కాలనీ కట్టడానికి పూనుకొన్నారు. డర్బను నుండి పద్నాలుగు మైళ్ళ దూరంలో  పీజాంగ్ నది ఒడ్డున ఒక విశాలమైన స్థలాన్ని కొన్నారు. మిస్టర్ వెస్ట్ తన వ్యాపారాన్ని మూసివేసి గాంధీతో కలిసి ఈ వలస గ్రామం లో నివసించసాగాడు.

తన తల్లీ, భార్యా పిల్లలూ తన సోదరితో సహా మొత్తం కుటుంబంతో ఇక్కడే స్థిరపడిపోయారు. ఈ ఫోనిక్స్ వలసగ్రామం డర్బన్ లో ఈనాటికి "హెరిటేజ్ సైట్ గా" సందర్శకులను ఆకర్షిస్తూనే  వుంది.

భారతీయుల హక్కులను కాలరాచివేయడానికి ప్రభుత్వం కొత్త కొత్త విధానాలను అవలింబించసాగింది. ఇందులో ఒకటి హిందూ ముస్లింల మధ్య వివాహ సంబంధాలను ప్రభుత్వం గుర్తించదు అని, ఇంకా "ట్రాన్స్ వాల్ ఇమ్మిగ్రేషన్ యాక్ట్" ప్రకారం భారతీయులెవ్వరూ సౌతాఫ్రికాలో ఎక్కడా కూడా ఉద్యోగాలు చేయడానికి వీలులేదనీ, మరి ఇండియన్ కూలీలు, వ్యాపారులు ఎక్కడైతే ఓడలు దిగారో అక్కడ తప్ప మరో ప్రాంతానికి వెళ్ళడానికి వీలులేదని చట్టం తెచ్చింది. ఈ విధానాలను వ్యతిరేకిస్తూ గాంధీ అహింసాయుత సత్యాగ్రహ పోరాటాన్ని కొనసాగించారు.

ఈ ప్రతిఘటన ఉద్యమం నడిపించడానికి ముందుకువచ్చే సత్యాగ్రహులకు శిక్షణ నిమిత్తం, ఇంకా ఈ ఉద్యమం కొనసాగించడానికి కావలసిన ప్రణాళికలను తయారుచేయడానికి, కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఒక కేంద్ర కార్యాలయం కావలసివచ్చింది. గాంధీకి సన్నిహితుడైన మరో ఆంగ్లేయ మిత్రుడు " హెర్మన్ కాలెన్ బాచ్" జోహన్స్ బర్గ్ నుండి ఇరవైరెండు మైళ్ళ దూరంలో వున్న తన వ్యవసాయక్షేత్రాన్ని బహూకరించారు. దానికి "టాల్స్టాయ్ ఫారం" గా నామకరణం చేశారు. గాంధీ సౌతాఫ్రికాలో తన చివరి సంవత్సరాలు ఇక్కడే నివసించాడు. ఈ టాల్స్టాయ్ ఫారంలో అన్ని వర్గాల, కులాల, మతాల వారు కలిసిజీవించేవారు. ఈ ఫారంలో నివసించే వారందరికీ శాకాహారపు భోజనమే చేయవలసి వుండేది. రోగాలకు రొష్టులకు ఆశ్రమంలో "ప్రకృతి చికిత్సాలయం" ఏర్పరచ బడింది. ఈ టాల్స్టాయ్ ఫారం కూడా హెరిటేజ్  ప్రదర్శనాలయంగా చిరకాలంగా నిలబడివుంది.

1913లో గాంధీ "ట్రాన్స్-వాల్ ఇమ్మిగ్రేషన్ యాక్ట్" ను వ్యతిరేకిస్తూ న్యూకాజిల్, నటాల్ నుండి 36 మైళ్ళ దూరంలో వున్న చార్లెస్ టౌన్, ట్రాన్స్-వాల్ వరకు పాదయాత్ర చేయతలబెట్టాడు. శ్వేతజాతీయులు కాక మరో జాతి వాళ్ళెవరూ ఈ చట్టం ప్రకారం ఒక రాష్ట్ర సరిహద్దులను దాటి మరో రాష్ట్రంలోనికి ప్రవేశించడానికి వీలు లేకుండా ఈ చట్టం చేయబడింది.

కాని గాంధీ తలపెట్టిన ఈ పాదయాత్ర  1913 నవంబరు నెల ఆరవ తేదీ నాడు రెండువేలకు పైగా కూలీ జనం సుమారు రెండువందలమంది స్త్రీలతో సహా ప్రభుత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ట్రాన్స్-వాల్ సరిహద్దును దాటారు. గాంధీని, ఆయన భార్య కస్తూరీబాయిని సరిహద్దు దాటగానే పోలీసులు అరెస్టు చేసి జైలుకి పంపారు. పోలీసులు విచక్షణా రహితంగా ఈ వందలాది కూలీలను చావబాది జైళ్ళలో పెట్టారు. ఎంత హింసించినా ఒక్క కూలీ కూడా తిరగబడలేదు. లాఠీ దెబ్బలని మౌనంగా భరించారు.

ఈ విప్లవాత్మకమైన పాదయాత్ర సంపూర్ణంగా విజయవంతం కావడంతో, గాంధీ తలబెట్టిన అహింసా ఉద్యమం పెద్ద ఎత్తున ఊపందుకొంది. ఈ ధోరణిని ఆందోళనను గమనించిన బ్రిటీషు ప్రభుత్వం గాంధీతో మంతనాలు మొదలెట్టింది. 1914లో "గాంధీ-స్మట్స్" ల మధ్య చర్చలతో జరిగిన ఒప్పందంలో బ్రిటీషు ప్రభుత్వం 25 పౌండ్లు, మూడు పౌండ్ల పన్నులను, నల్లజాతీయులను కించపరుస్తూ చేసిన చట్టాలను రద్దు చేసింది. అంతేకాక హిందూ ముస్లిముల మధ్య వివాహ సంబంధాలను చట్టబద్దం చేసింది, ఇమ్మిగ్రేషన్ యాక్ట్ లో చేయబడ్డ అనేక ప్రతిబంధాలను కూడా సడలించింది.

ఇది గాంధీకి, నటాల్ ఇండియన్ కాంగ్రెస్ కి, సత్యాగ్రహ  ఉద్యమానికి ఒక గొప్ప విజయమైంది. ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను అహింసావాదంతోనూ, సహాయానిరాకరణతోనూ, పోరాడి గెలవవచ్చునన్న సిద్ధాంతాన్ని బలోపేతం చేసింది. ఈ వార్త భారతదేశానికి చేరే సమయానికి ఇక్కడ గోఖలే వంటి నాయకుల సారధ్యంలో స్వాతంత్ర్య సమరం ఊపందుకుంటోంది. గోఖలే సౌతాఫ్రికాలో ఆంగ్లేయుల విధానాలపై పోరాడి విజయం సాధించిన గాంధీని సాధ్యమైనంత త్వరగా ఇండియాకు తిరిగి వచ్చి స్వాతంత్ర్య సమరంలో ఆంగ్లేయులతో జరుగుతున్న స్వాతంత్ర్య పోరాటానికి చేయూతనివ్వవలసిందిగా కోరాడు. దాదాపు సౌతాఫ్రికాలో స్థిరపడ్డ గాంధీ 21 సంవత్సరాల తర్వాత 1915లో ఇండియాకి తిరిగిరావడానికి నిశ్చయించుకున్నారు.

 సేకరణ: గాంధీ లుథిలీ డాక్యుమెంటేషన్ సెంటర్

 

మనదేశంలో చాలామందికి తెలియని విషయమేమిటంటే గాంధీ గారి కొడుకులూ, మనవలూ, మనవరాళ్ళూ, మునిమనవలూ కూడా సౌతాఫ్రికా అభివృద్ధి కోసం పాటుబడ్డవారే. గాంధీ రెండవ కొడుకు మణిలాల్ మోహన్ దాస్ గాంధీ (1892-1956) పసిపిల్లవాడిగా తల్లిదండ్రులతో కలసి సౌతాఫ్రికా వచ్చి జీవితమంతా అక్కడే స్థిరపడిపోయాడు. డర్బను కు దగ్గరగా అభివృద్ధి చెందిన ఫోనిక్స్ సెటిల్ మెంట్ గ్రామంలో తన నివాసం ఏర్పరచుకొని ఇండియన్ ఒపీనియన్ పత్రికలో సహాయకునిగా పనిచేయసాగాడు. కొద్దిరోజుల్లోనే ఈ పత్రికకు ఎడిటర్ గా బాధ్యతలు స్వీకరించి 1956లో తాను మరణించేవరకూ పత్రికను విజయవంతంగా ప్రచురించాడు. ఎన్నోసార్లు బ్రిటీషు ప్రభుత్వం జైలుకి పంపినా ఏ మాత్రం బెదరకుండా ఇంగ్లీషు వాళ్ళ అరాచకాల్ని తన పత్రికలో దుయ్యబట్టేవాడు. మణిలాల్ కి "సీత", "అరుణ్" "ఇలా" ముగ్గురు సంతానం.

మహాత్మా గాంధీ మనుమరాలు “ఇలా గాంధీ” సౌతాఫ్రికాలో సామాజిక శాంతి, సుస్థిరత లకు ప్రచారకురాలు. 1994 నుండి 2004 వరకూ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ANC) పార్టీ తరఫున క్వాజులూ - నటాల్ ప్రావిన్స్ లో వున్న "ఇనందా" రాష్ట్రం లోని "ఫోనిక్స్" ప్రాంతానికి "పార్లమెంటు మెంబరు" గా పనిచేశారు. ఆమె జన్మించింది కూడా ఫోనిక్స్ లోనే.

గాంధీగారి మరో మనవడు అరుణ్ గాంధీ, ఒక మంచి పాత్రికేయుడిగా పేరు గడించాడు. ఇండియన్ అమెరికన్ వ్యవహారాలలో ఒక సామాజిక కార్యకర్త.

గాంధీ మనవరాలు "సీత కుమార్తె" "ఉమా మేస్త్రీ" గాంధీ జీవితం గురించి విపులంగా ఒక పుస్తకం వ్రాసి ప్రచురించింది. ఆమె ద.ఆఫ్రికాలో ఒక సంఘసేవకురాలు ప్రస్తుతం ఆమె కేప్ టౌన్ లో నివసిస్తున్నారు.

  

గాంధీగారి వంశ వృక్షం

సేకరణ: గాంధీ లుథిలీ డాక్యుమెంటేషన్ సెంటర్

 

 

కాలక్రమం

(గాంధీజీ కాల వృత్తాంతం)

 

1869   -        గాంధీ జన్మించిన సంవత్సరం.

1891    -        గాంధీ లండన్లో బార్ ఎట్ లా లో ఉత్తీర్ణుడైన సంవత్సరం.

1893   -        మే నెల 24వ తేదీ - గాంధీ ఒక వ్యాపార సంబంధమైన కోర్టు వ్యవహారంలో ద. ఆఫ్రికా చేరిన రోజు.

1893   -        జూన్ నెల 7వ తేదీ - పీటర్ మారిట్జ్ బర్గ్ స్టేషన్లో రైల్లో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంటు నుండి ప్లాట్ ఫారం మీదకు బలవంతంగా తోసి వేయబడ్డ రోజు.

1894   -        నటాల్ ప్రభుత్వం "ఇండియన్ ఫ్రాంచైజ్ బిల్" ప్రవేశపెట్టింది.

1901    -        3 పౌండ్ల టాక్స్ బిల్ అమలులోకి వచ్చింది.

1904   -        డర్బను దగ్గరి ఫోనిక్స్ లో వలస వచ్చిన వారికోసం ప్రత్యేక గ్రామ నిర్మాణం..

1906   -        ప్రతి భారతీయుడూ తన గుర్తింపు కార్డు అన్ని వేళల్లోనూ దగ్గరనే ఉంచుకోవలసిన చట్టం అమలులోకి వచ్చిన రోజు.

 1907  -        ఇండియానుంచి వలస వచ్చినవారు, సౌతాఫ్రికా లో పని చేస్తున్న రాష్ట్రంలో తప్ప వేరే ఏ రాష్ట్రంలోనూ ఉద్యోగం/ పని చేయకుండా నిరోధించే చట్టం

19010  -        జోహాన్స్ బర్గ్ దగ్గర టాల్ స్టాయ్ ఫారం స్థాపన

1913    -        ట్రాన్స్వాల్ ఇమ్మిగ్రేషన్ యాక్ట్ కు నిరసనగా 2000 మంది పురుషులు, 127 మంది స్త్రీలతో న్యూ కాజిల్ నుండి ట్రాన్స్వాల్ లోని ఛార్లెస్ టౌన్ వరకూ పాదయాత్ర.

1914    -        3 పౌండ్ల టాక్స్ రద్దు – భారతీయుల వివాహాలకు చట్టం గుర్తింపు. నల్లవారి పట్ల వివక్ష చట్టం రద్దు. ట్రాన్స్వాల్ ఇమ్మిగ్రేషన్ రెస్ట్రిక్షన్ యాక్ట్ ను నామ మాత్రం చేయడం.

1915    -        ఇరవై ఒక్క సంవత్సరాల ద. ఆఫ్రికా జీవితం తర్వాత ఇండియాకు తిరిగిరాక.

1942   -        గాంధీ క్విట్ ఇండియా మూవ్మెంట్ మొదలు పెట్టిన సంవత్సరం

1947   -        బ్రిటిషు పరిపాలన నుండి ఇండియాకు స్వాతంత్య్రం

1948   -        గాంధీజీ దుర్మరణం

 

* * *