• ఇల్లు
  • ఇండెంచర్
    • చెఱకును గురించిన సంక్షిప్త చరిత్ర
    • సౌతాఫ్రికా లో గాంధీజీ
    • ఆంగ్లేయుల పాలనలో ఇండియా
    • ఇండెంచర్ టైటానిక్
    • 45 లక్షల ఇండెంచర్ సంతతితో మన అనుభందం
    • ఇండెంచర్ గ్రంథాలయం
  • యోగ్యతాపత్రములు
  • కఫాల
    • Kafala – the modern day indenture
  • పుస్తక పఠనములు
  • ఎక్కడ కొనవలెను?
Viriah Viriah
  • ఇల్లు
  • ఇండెంచర్
    • చెఱకును గురించిన సంక్షిప్త చరిత్ర
    • సౌతాఫ్రికా లో గాంధీజీ
    • ఆంగ్లేయుల పాలనలో ఇండియా
    • ఇండెంచర్ టైటానిక్
    • 45 లక్షల ఇండెంచర్ సంతతితో మన అనుభందం
    • ఇండెంచర్ గ్రంథాలయం
  • యోగ్యతాపత్రములు
  • కఫాల
    • Kafala – the modern day indenture
  • పుస్తక పఠనములు
  • ఎక్కడ కొనవలెను?

45 లక్షల ఇండెంచర్ సంతతితో మన అనుబంధం

  • Print
  • Email
  •  

     

    1. వెస్టిండీస్ పూర్వ క్రికెట్ ఆటగాడు ఆల్వీన్ కాలిచరన్
    2. నోబెల్ బహుమతి గ్రహీత v . s . నయీపాల్
    3. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గోల్ఫ్ ఆటగాడు విజయసింగ్
    4. చట్నీ పాప్ స్థాపకుడు సుందర్ పోపో
    5. మారిషస్ పూర్వ ప్రధానమంత్రి అనీరూద్ జగ్ నౌధ్

    పైన పేర్కొన్న వారందరికీ ఒక సామ్యత ఉంది. వారందరూ ఇండెంచర్ కూలీల సంతతి వారే! 13 లక్షల మంది ఇండియన్లను ఆంగ్లేయులు క్రీ.శ. 1840 ప్రాంతంలో ఐదు దేశాలకు ఇండెంచర్ కూలీలుగా పంపించారు. ఈనాడు వారి సంతతి ఈ క్రింద వ్రాయబడ్డ ఐదు దేశాలలోనూ కలిపి సుమారు 45 లక్షలకు పెరిగింది.

     

     

     

    ఇండెంచర్ కాలనీలలో నివసిస్తున్న 45 లక్షల భారతీయ సంతతి

    మూలం: ఐస్టాక్ ఫోటో - ప్రపంచపటం

    చిత్రపటం - యాజుష కృష్ణ

    వీరందరూ ఆయా దేశాలలో రకరకాల వృత్తులూ, వ్యాపకాలతో స్థిరపడి సుఖ జీవనం సాగిస్తున్నారు.

    ప్రపంచంలోని వివిధ దేశాలలో నివసిస్తున్న మా వంటి రెక్కలు ముక్కలు చేసుకుని, నడుములు విరిగేలా వివిధ దేశాల్లోని చెరకు ఫారాలలో శ్రమించిన మా పూర్వీకుల తాత ముత్తాతలు ఇండెంచర్ కూలీల సంతతి వారందరినీ నేను ఒక కుటుంబంగా భావిస్తున్నాను. వారనుభవించిన దుర్భర జీవితాల్ని ఆదర్శంగా తీసుకుని, ఇటువంటి దౌర్భాగ్యమైన ఇండెంచర్ విధానాలు మరోసారి జరగకుండావుండాలని కోరుకుంటున్నాను.

    ఇప్పుడు ఈ ఇండెంచర్ కూలీల కాలనీల గురించి వివరిస్తాను.

     

     

     వెస్టిండీస్

    మూలం: ఐస్టాక్ ఫోటో

    ఉత్తర, దక్షిణ అమెరికాలకూ మధ్య ప్రాంతాలలో వ్యాపించివున్న 700  ద్వీప సముదాయాన్ని వెస్టిండీస్ గా పిలుస్తారు. బహామాస్, క్యూబా, జమైకా, ట్రినిడాడ్, గయానా, ఆంటిగా, ఇంకా సెయింట్ విన్సెన్ట్ లాటి ద్వీపాలు ఈ వెస్టిండీస్ ద్వీపాలలో భాగమే. ఈ ద్వీపాలలోని బీచులు, ఇక్కడి సమశీతోష్ణ వాతావరణం, మరెక్కడా కానరాని వైవిధ్యమైన పర్యావరణం, ప్రకృతి ప్రపంచం నలుమూలల నుండీ సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. వెస్టిండీస్ అనగానే మనకు గుర్తొచ్చే వాటిల్లో ఎక్కడ చూసినా కనిపించే తాడిచెట్లు, మరెక్కడా కనిపించని బీచుల్లో తెల్లటి ఇసుక, బెల్లం సారాయి, కాలిప్యోసంగీతం, వివిధ రకాల రుచులతో దొరికే, భోజ్యాలు ఉంటాయి.

    అప్పట్లో 5,50,000  వెస్టిండీస్ దీవులకు ఇండెంచర్ కూలీలుగా వెళ్ళారు. అక్కడే స్థిరపడిపోయిన వారి సంతతి ఈ నాడు 18  లక్షలు. గయానా, సురీనాం, ట్రినిడాడ్, టొబాగో దీవులసమూహలన్నిటికన్నా ఇక్కడి ఇండియన్ జనాభా చాలా ఎక్కువ. రెండవ స్థానంలో జమైకా, గ్రెనాడా, సెయింట్ విన్సెన్ట్, సెయింట్ లూసియా, మార్టినిక్, ఇంకా గ్వాడిలోప్ ద్వీపసముదాయం ఉన్నది.

    నా చిన్నతనంలో క్రీ.శ. 1970లలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు, ప్రపంచంలో క్రికెట్ ఆడే అన్ని దేశాల జట్ల కన్నా పై స్థాయిలో, నెంబర్ వన్ గా వుండేది. ఇండియాలో క్రికెట్ అనేది ఒక మతం, ఆల్వీన్ కాలిచరన్, ఇంకా రోహన్ కన్హాయి వంటి అద్భుతమైన బ్యాట్సమెన్ ను నేను దేవుళ్ళ లాగా భావించేవాడిని. ఆరేడు సంవత్సరాల వయసులో నేను క్రికెట్ ఆడటం నేర్చుకోవటం మొదలుపెట్టాను. నాది ఎడమచేయి వాటం, ఇది గమనించిన నా కోచ్ నాకు ఆల్వీన్ కాళీచరణ్ లాగా ఎడమ చేతితో బ్యాటింగ్ చేయడం నేర్పాడు. స్కూల్, కాలేజీ దశలో నేను ఎడమ చేత్తో బ్యాటింగ్ చేస్తుంటే నా సహవిద్యార్థులు, నన్ను సరదాగా "కాళీచరణ్" అని అనేవారు. నేను ఈ పుస్తకం వ్రాసేటప్పుడు నాకు చాలా సంతోషం కలిగించిన ఒక విషయం గమనించాను. ఆల్వీన్ కాళీచరణ్, రోహన్ కన్హాయి, నేను మా ముగ్గురి మధ్య వున్న ఒక పోలిక, మేము ముగ్గురం కూడా ఇండెంచర్ కూలీల సంతతి నుండి వచ్చిన వాళ్ళమే. చాలా విచిత్రంగా క్రికెట్లోకి ఏమాత్రం సంబంధం లేకుండా మా మధ్య తెలియని ఏదో "ఆత్మీయ-అనుబంధం" వున్నట్లనిపించింది.

    నా పనుల పై నేను తరచూ న్యూయార్క్ వెళ్తుంటాను. అక్కడ టాక్సీలలో ప్రయాణించేటప్పుడు కాలక్షేపానికి కాస్సేపు ఆ టాక్సీ డ్రైవర్లతో పిచ్చాపాటీ మాట్లాడడం నాకు అలవాటు. ఇక్కడ కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమేమిటంటే కొంతమంది డ్రైవర్లు నన్ను అడుగుతుంటారు, మీకు హేమామాలిని, అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నాలు తెలుసా అని? మొదట్లో ఇటువంటి ప్రశ్నలు కాస్త సరదాగా అనిపించేవి. వీళ్ళకు ఇండియన్ సినిమా స్టార్ల గురించి తెలిసినందుకు కొంచెం ఆనందం కూడా కలిగేది. ఇప్పుడు ఈ పుస్తకం వ్రాసే ఆలోచన కలిగినప్పటినుండీ జమైకా, గయానా, ట్రినిడాడ్ ల నుండి వచ్చిన వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో నాకేదో తెలియని అనుబంధం వున్నట్లనిపిస్తుంది. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ సార్లు వాళ్ళ ఆహారపుటలవాట్లు, వాళ్ళు వినే సంగీతం, చూసే సినిమాలు, ఇంకా వాళ్ళ దేశాలలో పండే పంటలు మాట్లాడడం అలవాటైపోయింది. అందులో నాకు చాలా సంతోషం, తృప్తీ కలుగుతుంటాయి.


    గయానా

    వ్హిట్బీ, ఇన్కా,  హెస్పరస్ పేర్లు గల రెండు ఓడల్లో క్రీ.శ. 1838లో మే నెలలో ఇండియానుండి మొదటి ఇండెంచర్ కూలీలు గయానాకు తేబడ్డారు. వీళ్ళని స్థానికులు “గ్లాడ్ స్టోన్ కూలీలు” అనేవారు. గ్లాడ్ స్టోన్ అనే బ్రిటీషు రాజకీయవేత్త కొడుకు జాన్ గ్లాడ్ స్టోన్ కంపెనీలో పనిచేస్తున్నందువల్ల ఇండియన్ కూలీలకా పేరు వచ్చింది.

    క్రికెట్ ప్రసిద్ధ ఆటగాళ్లు రోహన్ కన్హాయి, ఆల్వీన్ కాళీచరణ్ లిద్దరూ గయానా వాసులే. ఇండియా నుండి వచ్చిన ఇండెంచర్ కూలీలు గయానాకు మే 5 వ తేదీన చేరినట్లు చరిత్ర. ఇప్పటికీ మే 5న గయానాలో ప్రభుత్వ సెలవు దినమే. దాదాపు 40 % శాతం గయానా ప్రజలు ఇండియా నుండి వచ్చినవారే. ఇండియా నుండి వచ్చిన కూలీలలో దాదాపు 60 % శాతం అరవై శాతం మంది నేటి ఉత్తరప్రదేశ్, బీహార్ లనుంచి వచ్చినవారు.

    ఈ నాడు గయానాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల సంఖ్య (3.5 ) మూడున్నర లక్షలు దాటింది.

    గయానాకు మొదటి ప్రధానమంత్రిగా సేవలందించిన వ్యక్తి "జగన్" ను ఆ దేశ జాతిపితగా వర్ణిస్తారు. జాతి, మత, వర్ణ విచక్షణ లేని సమాజాన్ని గయానాలో వికసితం చేయడానికి కృషి చేసిన వ్యక్తి జగన్. ఆయన పూర్వీకులు/తల్లిదండ్రులు ఉత్తర ప్రదేశ్ లోని "బస్తీ" నుంచి "ఇండెంచర్" లేబర్లుగా గయానా వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు.

    గయానాలోని ప్రధాన విమానాశ్రయాన్ని (ఎయిర్ పోర్ట్ ని) ఆయన పేరుతోనే "చెడ్డీ జగన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు" అంటారు.

    గయానాలో ప్రతి సంవత్సరం మే 5వ తేదిని "ఇండియన్ ఎరైవల్ డే" గా పండుగ చేసుకుంటారు. 1838 మే 5వ తేదీన ఇండియా నుండి ఇక్కడి చెరకు పొలాలలో, ఇంకా షుగర్ ఫ్యాక్టరీలలో పని చేయడానికై మొట్టమొదటి "ఇండెంచర్డ్ కూలీల" సమూహం తేబడ్డారు.

    గయానాలో "హోలీ" పండుగ చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఇక్కడ ఈ రోజు జాతీయ సెలవు దినం. హోలీని గయానాలో "ఫగ్ వా" అని అంటారు. హిందూ క్యాలెండరు ప్రకారం 11వ (పదకొండవ) నెల ఫాల్గుణం. "ఫగ్వా" అనే పదం, ఫాల్గుణం నుంచి పుట్టింది.

    కొంతమంది ఇండో-గయనీస్ ప్రముఖుల పేర్లను ఈ క్రింద పొందుపరిచాను:-

    1. అల్వీన్ కాళీచరణ్ (మాజీ వెస్టిండీస్ క్రికెట్ కాప్టెన్)
    2. బెర్ ట్రాండ్ రాంచరణ్ (యునైటెడ్ నేషన్స్ లో ఒకప్పటి మానవహక్కుల పరిరక్షణ హై కమిషనర్)
    3. భారత్ జగదేవ్ (పూర్వ గయానా అధ్యక్షుడు)
    4. చడ్డీ జగన్ (గయానాకు 1992 నుండి 1997 వరకు అధ్యక్షుడు)
    5. డాక్టరు. డెబోరా పెర్సాద్ (ప్రపంచ ప్రసిద్ధి గాంచిన క్రిమి పరిశోధనా శాస్త్రవేత్త)
    6. హరిశ్చంద్ర ఖేమ్ రాజ్ - రచయిత
    7. లక్షీకాళీచరణ్ - రచయిత
    8. మోజస్ నాగమూటూ - (గయానా ప్రధానమంత్రి)
    9. రోహన్ కన్హాయి - (వెస్టిండీస్ క్రికెట్ పూర్వ కాప్టెన్)
    10. శివనారాయణ్ చంద్రపాల్ (వెస్టిండీస్ క్రికెట్ పూర్వ కాప్టెన్)
    11. శ్రీదత్ రామ్ ఫల్ (పూర్వ కామన్ వెల్త్ సెక్రటరీ జనరల్)

     

    ట్రినిడాడ్

    అత్యధిక సంఖ్యలో ప్రవాస భారతీయులు స్థిరపడ్డ ప్రదేశం వెస్టిండీస్ లోని "ట్రినిడాడ్". ఇక్కడ స్థిరపడ్డ భారతీయులు 7 (ఏడు) లక్షలకు పైగానే వున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన క్రికెట్ ఆటగాడు బ్రియన్ లారా ఈ దేశస్థుడే. ఇంకా పేరొందిన క్రికెట్ ఆటగాళ్ళు సన్నీ రామాదీన్, సునీల్ నారాయణ్ మరియు దినేష్ రాందిన్ లు కూడా భారతీయ సంతతి వారే.

    వెస్టిండీస్ దీవుల పటంలో అట్టడుగున కాన వచ్చే ద్వీపం ట్రినిడాడ్. ఈ దీవి వెనిజులా దేశానికి ఏడు మైళ్ళ దూరంలో ఉంది. అక్కడి ప్రాంతీయ భాష "ఆరవాక్స్" లో ఈ దీవి పేరు "ఐయ్యిరి" అనగా (హమ్మింగ్ బర్డ్ ల ద్వీపం) అని అర్ధం. క్రీ.శ. 1498లో కొలంబస్ "లా ఇస్లా డీ లాట్రినిడాడ్" గా ఈ ద్వీపానికి నామకరణం చేశాడు.

    సుమారు 20%  హిందువులూ, 5%  ముస్లింలూ ఉన్న ట్రినిడాడ్ వివిధ మతాల, నాగరికతలు, రకరకాల జాతుల సమ్మేళనం. ఇండియా నుంచి ట్రినిడాడ్ కు తేబడ్డ ఇండెంచర్డ్ కూలీలలో ఎక్కువశాతం ఉత్తరప్రదేశ్ నుంచీ, కొద్దిమంది బీహార్ నుంచీ వచ్చినవారు. వీరిలో ఎక్కువశాతం మంది హిందీ భాషకు మాండలికంగా చెప్పబడే భాష భోజ్ పురి మాట్లాడతారు. ఈనాటికి ట్రినిడాడ్ లో ఉన్న చాలామంది ఇండియన్లు "భోజ్ పురి"నే మాట్లాడతారు.

    చట్నీ మ్యూజిక్ ని రసవంతంగా ప్రపంచానికి అందించిన సుందర్ పోపో ట్రినిడాడ్ వాడే! హిందీ జానపద సంగీతాన్ని ట్రినిడాడ్ యాసలో ఇంగ్లీషు సంగీతాన్ని మేళవించి సుందర్ పోపో అందించిన శ్రావ్యమైన సంగీతం ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను అలరిస్తోంది. "చల్ బోకే నహీ" అని ప్రియుడు ప్రేయసిని ఇండియాకి తనతో కలిసి రమ్మని పిలుస్తూ పాడిన పాట నాకు చాలా నచ్చిన పాట.

    ట్రినిడాడ్ లో అత్యధికంగా తినే అల్పాహారాన్ని "డబుల్స్" అంటారు. కొద్దిగా కాల్చిన రొట్టె ముక్కలలో శనగల కూర దట్టించి, కొద్దిగా ఆకుకూర పచ్చడి పూతతో తింటారు. పొలాలలో పనిచేసే కూలీలకు ఇంకా ఇతరులకు కూడా తక్కువ సమయంలో తయారై త్వరగా తినగలిగిన ఈ వంటకం "డబుల్స్". 1937వ సంవత్సరంలో జన్మించి కాలక్రమేణా ప్రసిద్ధి చెంది ఇండెంచర్ కాలం తరువాత ఈనాటికీ వెస్టిండీస్ మొత్తానికి చాలా ఇష్టమైన ఆహార పదార్థంగా మిగిలిపోయింది.

     

    కొంతమంది ఇండో-ట్రినిడాడియాన్ ప్రముఖుల పేర్లు ఈ క్రింద పొందు పరుస్తున్నాను.

    1. భడాసే సాగన్ మహారాజ్ - సనాతన ధర్మసభ స్థాపకుడు, హిందూ ధర్మ ప్రచారకుడు.
    2. దెబోరా పెర్షాద్ - ఎయిడ్స్ రీసెర్చెర్
    3. నిక్కీ మినాజ్ - ట్రినిడాడ్ "రాప్" సంగీతకారిణి (ర్యాపర్ & సాంగ్ రైటర్)
    4. రవి రామ్ పాల్ - ప్రస్తుత వెస్టిండీస్ టీం క్రికెట్ ఆటగాడు
    5. శివానా జొరావర్ - వకీలు, ఇంకా స్త్రీ, శిశు ఆరోగ్య కార్యకర్త
    6. వి . ఎస్ . నయీపాల్ - 2001లో నోబెల్ బహుమతి గ్రహీత, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రచయిత.

     

    జమైకా 

     ఉసైన్ బోల్టు మరియు క్రిస్ గేల్

    మూలం: ఐస్టాక్ ఫోటో

     జమైకా అనగానే నాకు రెండు పేర్లు గుర్తుకొస్తాయి. మొదటిది ఉసైన్ బోల్టు, ప్రపంచంలో తనకన్నా వేగంగా పరుగెత్తగల మానవుడు లేదని నిరూపించినవాడు, రెండవది ఇండియాలో క్రికెట్ గురించి తెలిసిన ప్రతి వ్యక్తికీ తెలిసిన పేరు "క్రిస్ గేల్". గొప్ప క్రికెట్ ఆటగాడిగా ఇటు ఇండియాలోనూ అటు మిగతా క్రికెట్ ప్రపంచానికీ కూడా చాలా ఇష్టమైన క్రికెటర్ గా పేరుగాంచిన "క్రిస్ గేల్" జమైకా వాసియే!

    ఇండియా నుండి ఇండెంచర్ కూలీలను తీసుకెళ్ళిన మొట్టమొదటి ఓడ " మెయిడ్ స్టోన్" 1945లో జమైకాలోని "ఓల్డ్ హార్బర్ బే" ఓడరేవులో దింపింది. ఈ కూలీలలో చాలా వరకు భోజ్ పురి, అవధ్ ప్రాంతాల నుండి వచ్చిన వారే (ప్రస్తుత , ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్) ఇందులో కొద్దిమంది ప్రస్తుత రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ ఇంకా ఉత్తరాఖండ్ ప్రాంతాల వారు కూడా వున్నారు.

    ఇక్కడి ప్రభుత్వం జమైకా ఆర్ధిక, సామాజిక అభివృద్ధి కోసం ఇండియన్లు చేసిన సేవలకు గుర్తింపుగా మే 10వ తేదీన ఇండియన్ హెరిటేజ్ డే గా 1995లో గుర్తింపు ఇచ్చింది.

    షుమారు ఒక లక్షమంది భారతీయులు జమైకాలో స్థిరపడ్డారు. ముస్లిం ల ఆరాధ్య దైవమైన మహమ్మద్ మనవడు హుస్సేన్ పేరు మీదుగా జరుపబడే "హోసై" పండుగ ఇండో-జమైకన్ సంస్కృతికి ప్రతిబింబం. దీపావళి కూడా జమైకాలో జరుపుకునే గొప్ప పండుగ.

    మొట్టమొదటగా జమైకాలో వరి ధాన్యం పండించింది భారతీయులే! ఆ దేశంలోని మొట్టమొదటి "రైస్ మిల్" బియ్యం ఫ్యాక్టరీ 1890లో స్థాపించబడింది.

    భారతీయ సంతతికి చెందిన కొందరు ప్రముఖుల పేర్లు ఈ క్రింద పొందుపరుస్తున్నాను.

    1. డయానా కింగ్, ఆర్&బి అండ్ డాన్స్ హాల్ ఆర్టిస్ట్ - ఫైవ్ స్టార్, ఆర్&బి/పాప్ గ్రూప్
    2. జామీ గన్నెస్ - మోడల్
    3. కమలా - జీన్ గోపి - రాజకీయవేత్త
    4. లీసా హన్నా,1993 మిస్ వరల్డ్ (సెయింట్ యాన్ సౌత్ ఈస్టరన్ ప్రాంతానికి పార్లమెంట్ మెంబరు)
    5. రాజీవ్ మారఘ్, జాకీ
    6. సబ్రినా కోలీ - నటీమణి (యాక్ట్రెస్)
    7. షౌన్ బ్రిడ్జ్ మోహన్, జాకీ (గుర్రప్పందాలలో ప్రపంచంలో పెద్ద స్థాయి కెంటకీ డెర్బీలో పాల్గొన్న మొదటి జమైకన్ జాకీ)
    8. సూపర్ క్యాట్, డాన్స్ హాల్ ఆర్టిస్టు
    9. యాండీ ఫిలిప్స్ - మిస్ జమైకా వరల్డ్ బ్యూటీ పెజెంట్ గెలిచిన మహిళ.

     

     సౌతాఫ్రికా

    ఇండియా, అమెరికాల తర్వాత సౌతాఫ్రికాని నేను నా మూడవ స్వదేశం సౌతాఫ్రికా. అక్కడి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నేషనల్ పార్కులు  దేశమంతటా వ్యాపించివున్న ఎన్నో పెద్ద పెద్ద ఆటల మైదానాలు, గొప్ప గొప్ప పర్వత పంక్తులూ, వర్ణింప శక్యం కానంత అందమైన ప్రకృతి, చాలా అరుదైన సముద్ర తీర దృశ్యాలు, బీచ్ లు వాటికవే సాటి. అక్కడి ప్రజలూ, సంగీతమూ, ఆహార వ్యవహారాదులూ నన్నలరించాయి. గత రెండు, మూడు వందల సంవత్సరాలుగా చాలా బాధాకరంగా ఉన్న అక్కడి రాజకీయ పరిస్థితులూ మనోవేదనకు గురి చేస్తున్నాయి. రాబోయే కాలంలో సౌతాఫ్రికా జీవితం ప్రశాంతంగా సుఖ శాంతులతో గడవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. సౌతాఫ్రికా, ఇండియాల మధ్య క్రికెట్ మ్యాచ్ లు జరిగినప్పుడు నాకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. ఏ టీం గెలిస్తే బాగుంటుందో నిర్ణయించుకోలేకపోతుంటాను. అందుకే రెండు టీంలకూ జై కొడుతుంటాను. రెండూ నాస్వదేశాల జట్లే, నాకు మాత్రం ఏ టీం గెలిచినా ఆనందమే!

    సౌతాఫ్రికా గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు నాకు ముందుగా గుర్తుకు వచ్చేది అక్కడ దొరికే అతి రుచికరమైన ఆహార పదార్ధం "బన్నీ చౌ". ఇది  డర్బను లో పుట్టిన భారతీయ సాంప్రదాయకమైన చిరుతిండి. బేకరీలో తయారైన రొట్టెలో మధ్యలో వున్న కొంత పిండిని తీసివేసి అందులో కూరగాయలతో వండిన కూరను గానీ, వండిన మాంసంతో గానీ, వండిన కోడి మాంసం వగైరాలను కూరి తయారు చేస్తారు. మొదట్లో ఈ "బన్నీచౌ" ని కూరగాయలతో మాత్రమే తయారు చేసేవారట.

    ఇండెంచర్ కాలంలోనే ఈ బన్నీచౌ అవతరించిందని చెబుతారు. పొలాలలో పనిచేసే ఇండెంచర్ కూలీలకు మధ్యాహ్న భోజనం కోసం ఆహారం వండి తీసుకువెళ్ళడం సాధ్యమయ్యేది కాదు, ప్రతిగా ఈ బన్నీచౌ వారి సమస్యను తీర్చింది.

    దాదాపు 13  లక్షలమంది భారతీయులు అక్కడి ఆర్ధిక, సామాజిక, రాజకీయ రంగాల్లో పాల్గొని ఆదేశానికి సేవ చేస్తుంటారు. ఇండియా సరిహద్దుల బైట ఎక్కువమంది ఇండియన్లు నివసిస్తున్న నగరం డర్బన్, సౌతాఫ్రికా స్వాతంత్ర్య సమరంలో ఇండియా చాలా ప్రధానమైన పాత్ర వహించింది. 1913లో నాటాల్ నుంచి ట్రాన్స్ వాల్ వరకూ గాంధీ గారి గ్రేట్ మార్చ్ సౌతాఫ్రికాని ఎంతో ప్రభావితం చేసింది. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా జరిగిన అహింసాయుత పోరాటమిది. తరువాతి రోజులలో గాంధీ సంతతి వారు సౌతాఫ్రికా సామాజిక అభివృద్ధికై ఎంతో కృషి చేశారు/చేస్తున్నారు.

    సౌతాఫ్రికా ఇండియాతో ప్రత్యేకమైన సంబంధం కలిగి వుండడానికి కారణం గాంధీజీ. గాంధీ గారు సౌతాఫ్రికాలో 21 సంవత్సరాలు గడిపారు. ఆయన సంతానం, మనుమలు, ముని మనుమలు కొంతమంది ఇప్పటికీ అక్కడే సౌతాఫ్రికాలోనే సామాజిక సేవలోను, ఇతరత్రా కార్యకలాపాలలోనూ క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.

    నెల్సన్ మండేలాను అక్కడి "జాతిపిత" గా గౌరవిస్తారు. బ్రిటీషు వారి నుండి స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటంలో ఆయన 27 సంవత్సరాలకు పైగా జైలు జీవితం అనుభవించారు.

    నెల్సన్ మండేలా నాకు స్ఫూర్తి దాత “గాంధీజీ" అని చెప్పుకునేవారు. ఇక్కడ చదువరులందరికీ ఒక సూచన - సౌతాఫ్రికా చరిత్రనూ, అక్కడ బ్రిటీషు వారు చేసిన క్రూరమైన అకృత్యాలనూ, వర్ణ విచక్షణా విధానాన్నీ వివరంగా తెలుసుకోవడానికి దయచేసి నెల్సన్ మండేలా వ్రాసిన "లాంగ్ వాక్ టు ఫ్రీడమ్" అనే పుస్తకం చదవండి. "ఇన్విక్టస్" లో ఈ విషయాల్ని వివరంగా చూపించారు. నాకు ఇది ఎంతో ఇష్టమైన సినిమా. కొన్ని వందల సంవత్సరాల తర్వాత స్వాతంత్య్రం సముపార్జించుకున్న ఒక దేశం, భిన్నత్వాలతో విడివిడిగా ఆలోచించే ఒక దేశాన్ని ఒక "క్రీడ" ఏకం చేసింది.

    జూన్ నెల 7వ తేదీ 1893 నాడు గాంధీజీని రైలు నుండి బయటకు త్రోసి వేయబడ్డ చోటు "పీటర్ మారిట్జ్ బర్గ్ రైల్వే స్టేషన్" లో ఈ సంఘటనను వర్ణిస్తూ వ్రాయబడ్డ శిలాఫలకాలు వున్నాయి. సౌతాఫ్రికాను దర్శించే వారందరూ విధిగా అక్కడకు వెళ్ళి గాంధీజీ పట్ల తమ కున్న గౌరవాన్ని చాటుకుంటారు. ఈ మధ్యకాలంలో టూరిజం పరంగానూ, ఇంకా అనేక సినిమాల చిత్రీకరణ కోసం ఎంతో మంది ఈ స్థలాన్ని సందర్శిస్తూ వుంటారు.

    భారతీయ సంతతి వారి కొన్ని సంఘాలు ఎంతో బాధ్యతతో సమిష్టిగా అక్కడ పండుగలు నిర్వహిస్తారు, భారతీయ భాషలూ, సాంప్రదాయకమైన సంగీత, నృత్యాలూ వంటి కళలు నేర్పించే పాఠశాలలు నిర్వహిస్తున్నారు.

    డాక్టర్ యూసుఫ్ దాదూ, జి. ఎమ్. నాయకర్, ఇస్మాయిల్ మీర్, జే.ఎన్.సింగ్, యూసుఫ్ ఛాచ్లీయా, అమీనా ఛాచ్లీయా ఇంకా నానాసీతా వంటి ఎంతోమంది ఇండియన్లు వర్ణ విచక్షణకి కు ఎదురు పోరాడిన ప్రముఖులు "అహమద్ కాత్రాడా నెల్సన్ మండేలా" తో రాబ్బెన్ ద్వీపంలో సుమారు 26 సంవత్సరాలు గడిపాడు.

    సౌతాఫ్రికాలో స్థిరపడ్డ మరికొద్దిమంది ఇండియన్ ఇండెంచర్ సంతతి వారి పేర్లు ఈ క్రింద పొందుపరుస్తున్నాను.

    1. దీపక్ పాండే - "కింగ్స్ ఆఫ్ డర్బన్ ట్రైలాజి" పుస్తక రచయిత.
    2. పాతిమా చోహాన్ - సౌతాఫ్రికా ప్రభుత్వంలో హోంశాఖ ఉపమంత్రి.
    3. గూలామ్ వాహిద్ & అశ్విన్ దేశాయ్, "ఇన్ సైడ్  ఇండియన్ ఇండెంచర్" - జంట రచయితలు (సౌతాఫ్రికా ఇండెంచర్ వివరాల కోసం తప్పక చదువవలసిన పుస్తకం)
    4. కాదర్ ఆస్మాల్ - సమాజసేవకులు
    5. కూమీ నాయుడు - సమాజసేవకులు
    6. మాక్ మహారాజ్ - సమాజసేవకులు
    7. నటాషా పిళ్లే - విద్యావిషయ సంచాలకులు/రాజకీయవేత్త
    8. నవీ పిళ్లే - ఐక్యరాజసమితిలో "మానవహక్కుల హైకమిషనర్"
    9. ప్రవీణ్ గోవర్ధన్ - రాజకీయ నాయకుడు
    10. సాగరెన్ పిళ్లే - రియర్ అడ్మిరల్ (సౌతాఫ్రికన్ నేవీ)

     

     రీయూనియన్

     

     

     

    క్రీ.శ. 1700 సం. ప్రాంతంలో ఫ్రెంచి వారి కాలనీగా మారిన ఈ "రీయూనియన్" చిన్న ద్వీపం, చాలా అందమైన ప్రకృతితో సందర్శకులను ఆకర్షిస్తూవుంటుంది. మొదట్లో ఇక్కడకు వచ్చిన వలసదారులు ఇక్కడి సారవంతమైన భూమి చూసి వ్యవసాయం చేసేవారు. కొద్దికాలంలోనే చెరకు పండించడం మిగతా పంటల కన్నా ఎక్కువ లాభసాటి అని అర్ధమైపోయింది. అప్పట్లో ఆఫ్రికా, మడగాస్కర్ ల నుండి తేబడ్డ బానిసలతో తమ వ్యవసాయం సాగించేవారు. కానీ క్రీ.శ. 1700 ప్రాంతంలో ఫ్రాన్స్ దేశంలో "బానిస"విధానం రద్దు చేయబడటంతో, చౌకగా లభించే కార్మికులు, కూలీలకోసం వెతుకులాటమొదలైంది.

    అప్పట్లో "ఫ్రెంచి ఈస్టిండియా కంపెనీ" వారికి సూరత్, మచిలీపట్నాలలో ఫ్యాక్టరీలు వుండేవి. కాని చాలా కొద్దికాలంలోనే ఫ్రెంచివారు బ్రిటీషు వారితో యుద్ధంలో ఓడిపోవడంతో ఇండియాలోని ఫ్రెంచి వ్యాపారమంతా బ్రిటీషు ఈస్టిండియా వారి వశమైపోయింది. కాని ఫ్రెంచివారు పాండిచ్చేరి లాంటి అంతగా ప్రాముఖ్యతలేని ప్రాంతాల్లో 1960 వరకూ తమ ఉనికిని నిలుపుకోగలిగారు. అయితే ఈనాటికీ కూడా ఫ్రెంచివారి పద్ధతులూ, వారిభాష, సంస్కృతి, వారి ఆహారవ్యవహారాలూ, వారి కళావైదుష్యము పాండిచ్చేరిలో మనకు కనిపిస్తూనే వుంటాయి.

    "రీయూనియన్" లో స్థిరపడ్డ భారతీయులు నేటికీ ఇండియన్ సాంప్రదాయాలే పాటిస్తుంటారు, పండుగలు పబ్బాలు ఇక్కడి వలెనే జరుపుకుంటారు. "రీయూనియన్" రాజధాని "సెయింట్ యాంద్రే" లోని రెస్టారెంట్లలో అన్నిరకాల ఇండియన్ వంటకాలు లభిస్తాయి.

    ప్రవాస భారతీయులెంతో మంది వున్న "రీయూనియన్" దేశం వర్ణింప శక్యము గానంత ప్రకృతి అందాలున్న ప్రాంతం. ఇండియా నుండి "టూరిజం" కోసం వెళ్ళేవారు తప్పక చూడవలసిన ప్రాంతం.

    "రీయూనియన్"లో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన కొంతమందిని ఈ క్రింద పొందుపరుస్తున్నాను.

    1. డినైస్ నీలామేయోమ్ - టాంపన్ పట్టణ డిప్యూటీ మేయర్
    2. డిడియర్ రాబర్ట్ - 2013లో ఈయన ఆధ్వర్యంలోనే 53 (యాభై ముగ్గురు ప్రతినిధులు ఇండియాను దర్శించారు)
    3. డొమినిక్ సోరేన్ - పూర్వ దేశాధ్యక్షడు
    4. డాక్టర్. ఆర్మోదమ్ లేనా, దంత వైద్య నిపుణుడు, సామాజిక కార్యకర్త.
    5. జీన్-పాల్ వీరపుల్లే - సెయింట్ ఆంద్రే నగర మేయర్, రీయూనియన్ జనరల్ కౌన్సిల్ మొదటి ఉపాధ్యక్షుడు
    6. నాడియా రామస్సామ్ - జనరల్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు
    7. నస్సీమా దీన్ దార్ - "రీయూనియన్" రాష్ట్ర జనరల్ కౌన్సిల్ అధ్యక్షురాలు
    8. ప్రొ. ఫ్రెడరిక్ కాడెట్ - "రీయూనియన్" రాష్ట్ర జనరల్ కౌన్సిల్ అధ్యక్షుడు
    9. సెర్జ్ కామాచ్చి - " "రీయూనియన్" రాష్ట్ర జనరల్ కౌన్సిల్ అధ్యక్షురాలు

      

    ఫిజి

    1998 లో నేను అమెరికా వచ్చిన కొత్తలో "గోల్ఫ్" ఆటకు సంబంధించి ఒరకమైన అలజడి జరిగింది. భారతీయ సంతతికి చెందిన గోల్ఫర్ విజయసింగ్ ప్రొఫెషనల్ గొల్ఫర్స్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా (PGA) ని గెలుచుకున్న మొదటి భారతీయ సంతతివాడయ్యాడు. వార్తాపత్రికలన్నీ విజయసింగ్ ని భారతీయ సంతతి చెందిన ఒక గొప్ప ఆటగాడిగా అభివర్ణించాయి. నేను కూడా ఆవార్త చదివి గొప్పగా ఫీలయ్యాను. కాని నిజానికి నాకు అప్పట్లో విజయసింగ్ గురించిన పూర్వాపరాలు ఏమీ తెలియవు. విజయసింగ్ పూర్వీకులు ఇండియా నుండి ఫిజి వెళ్ళిన వలసదారులే!

    ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లకు దగ్గరగా వున్న 800 చిన్న చిన్న ద్వీపాల సముదాయం "ఫిజి". ఇక్కడ స్థిరపడిన ఇండెంచర్ కూలీలంతా ఉత్తరప్రదేశ్, బీహారు ప్రాంతాలనుంచి వచ్చిన వారే. ఇక్కడ వీరిని గిర్మీటియాస్ (అంటే అంగీకారం అని అర్ధం) అని పిలుస్తారు.

    ఇక్కడి ఇండియన్లు వ్యాపార, రాజకీయ,సాంఘిక వ్యవస్థలలో తమ వంతు కృషిచేసి స్థానికులతో పాటు "ఫిజి" అభివృద్ధి కి తోడ్పడ్డారు. 1999 లో మహీంద్ర పాల్ చౌధరీ ఇక్కడ ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. ఇక్కడి జనాభా దాదాపు  తొమ్మిది లక్షలైతే అందులో మూడవవంతు అంటే దాదాపు మూడు లక్షలమంది భారతీయ సంతతికి చెందిన వారే! 1987 లో అక్కడ జరిగిన మిలిటరీ తిరుగుబాటుకు ముందు దాదాపు అక్కడి జనాభాలో 45 % "నలభై ఐదు శాతం" ప్రజలు ఇండోఫిజియన్లే. మిలిటరీ తిరుగుబాటు తర్వాత స్థానికులు, వలస వచ్చిన వారి మధ్య కలహాలు, ఘర్షణల కారణంగా సుమారు 100,000  వలసదారులు ఆస్ట్రేలియా, కెనడా దేశాలకు వలస వెళ్ళిపోయారు. ఆ తరువాత ప్రతి సంవత్సరం ఫిజిలో మే 14వ తేదీన "గిర్ మిత్ డే" "ఇండియా అరైవల్ డే" గా సంస్మరణ దినంగా జరుపుకుంటారు.

    డాక్టర్ బ్రిజ్ లాల్ గారు ఇండో ఫిజియన్లందరికన్నా ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకున్న వ్యక్తి. లక్షలాది మంది భారతీయులు ఎన్ని దేశాలకో వలస వెళ్ళిన వివరాలను గ్రంధస్తం చేసిన మహానుభావుడాయన. ఆయన పరిచయం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

    భారతీయ సంతతికి చెందిన కొందరు ఇండో-ఫిజియన్ల వివరాలు ఈ క్రింద వ్రాస్తున్నాను.

    1. బద్ర మహరాజ్ - రైతు, రాజకీయవాది, సమాజ సేవకుడు 
    2. బాబ్బీ సింగ్ - పూర్వ అమెరికన్ - కెనడియన్ ఫుట్ బాల్ ఆటగాడు
    3. ఇమ్రానా జలాల్ - ఐక్యరాజసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో మానవ హక్కుల సంఘం సలహాదారు.
    4. జైరామ్ రెడ్డి - రువాండా అంతర్జాతీయ మెంబర్ ఆఫ్ యాంటీ క్రిమినల్ ట్రిబ్యునల్
    5. జాయ్ అలీ - బాక్సర్
    6. మహీంద్ర పాల్ చౌధరీ - 1999లో ఎన్నుకోబడ్డ ఇండో-ఫిజియన్ ప్రధానమంత్రి
    7. రాజీవ్ ప్రసాద్ - పూర్వపు న్యూజిలాండ్ పార్లమెంటులో సభ్యుడు
    8. రాజేష్ చంద్ర - ఫిజి యూనివర్సిటీ కి మొట్టమొదటి ఉపాధ్యక్షుడు
    9. రాకీ ఖాన్ - న్యూజిలాండ్ "రగ్బీ" సెవెన్స్ ఆటగాడు.
    10. విజయసింగ్ - పూర్వ నెం.వన్ ప్రపంచ గోల్ఫర్.
    11. బ్రీజ్ లాల్ - ప్రసిద్ధ రచయిత

     

    మారిషస్

    క్రీ.శ. 1896 లో అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ (ప్రపంచమంతటా పేరొందిన గొప్ప పుస్తక రచయిత) "మార్క్ ట్వైన్" మారిషస్ ను సందర్శించాడు. మారిషస్ ను చూసి ఆయన ఎంత అబ్బురపడ్డాడంటే "భగవంతుడు మారిషస్ ను ముందు తయారుచేసి, దీని నకలుగా స్వర్గాన్ని తయారు చేసి ఉంటాడు అని వ్యాఖ్యానించాడంటారు.

    ఇక్కడ సహజంగా ఏర్పడ్డ బీచ్ లూ, అద్భుతమైన ప్రక్రుతి దృశ్యాలూ, చూసి తీరవలసిందే. హనీమూన్ కి వెళ్ళే వారికి మారిషస్ ఒక స్వర్గమే. కాని మూడువందల సంవత్సరాల ఇక్కడి బానిసల చరిత్ర మారిషస్ పై మాయని మచ్చగా మిగిలిపోయింది. 1810 వరకూ ఫ్రెంచి కాలనీగా వున్న మారిషస్ ఆ తరువాత బ్రిటీషు వారి ఆధీనంలోకి వెళ్ళిపోయింది. 1968లో బ్రిటీషు పాలన నుండి స్వాతంత్య్రం లభించింది. ఇక్కడి ప్రజలు కొంతమంది ఇంగ్లీషు, ఫ్రెంచి భాషల్ని మాట్లాడతారు. హిందీ, తెలుగు, తమిళం కూడా ఎక్కువ మంది ప్రజలు మాట్లాడుతుంటారు.

    1834 వ సం. నవంబరు 2 ఆదివారంనాడు ది అట్లాస్ అని పేరు గల ఓడలో 36 మంది బీహారు కూలీల రాకతో మారిషస్ లో ఇండియన్ ఇండెంచర్ శకం మొదలైంది. తరువాతి కాలంలో బీహార్, ఉత్తరప్రేదేశ్, ఇంకా ఆంధ్రప్రదేశ్ వంటి అనేక ప్రాంతాల నుండి మారిషస్ చేరిన ఇండియన్ ఇండెంచర్ ఇమ్మింగ్రెన్ట్ల సంఖ్య నాలుగులక్షల యాభైమూడువేల అరవైమూడుకి చేరింది.

     

     

    అన్ని ఇండెంచర్ కాలనీల కన్నా మారిషస్ లోనే ఇండియన్లు ఎక్కువమంది స్థిరపడ్డారు. వెస్టిండీస్, ఫిజి, సౌతాఫ్రికాలోని ఇండియన్ ఇండెంచర్ కూలీలు తమ హక్కులకోసం ఎంతో శ్రమించవలసి వచ్చింది, స్థానిక ప్రభుత్వాలతో పోరాడవలసి వచ్చింది. కాని మారిషస్ లో మాత్రం దీనికి భిన్నంగా ఇండియన్లు మొదట్నుంచీ అక్కడి వ్యవస్థలో విశిష్టమైన స్థానంలోనే ఉన్నారు. అక్కడి 15 లక్షల జనాభాలో 70% భారతీయ సంతతి వారే!

    మారిషస్ కి బ్రిటీషు పాలన నుండి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అక్కడ ఏర్పడ్డ ప్రభుత్వానికి మొదటి, రెండవ ప్రధానమంత్రులిద్దరూ భారతీయ సంతతి వారే. మొదటి ప్రధాని "సర్ శివూసాగర్ రామ్ గూలామ్" (ఈయన మారిషష్ కి బ్రిటీషు వారి నుండి స్వాతంత్య్రం కోసం పోరాడిన ప్రముఖ స్వాతంత్ర్యయోధుడు) అయితే రెండవ ప్రధాని అనిరుధ్ జగ్ నౌధ్ "కార్ల్ ఆఫ్ మాన్" మినహాయించి ఇప్పటివరకూ మారిషస్ ప్రభుత్వానికి అధ్యక్షులుగా పనిచేసిన వారందరూ భారత సంతతి వారే. మధ్యలో కొద్దికాలం ప్రధానిగా చేసిన "పాల్ బెరెంగర్" తప్ప మిగతా ప్రధానులందరూ ఇండియన్ సంతతివారే.

    "పోర్ట్ లూయిస్" లో ఉన్న అప్రవాసీ ఘాట్ (అప్రవాసీ అంటే హిందీలో దేశాంతరవాసి అని అర్ధం)లో ఆరోజుల్లో ఇండియా నుంచి వచ్చిన కూలీలకు ఇమ్మిగ్రేషన్ పరీక్షలు జరిగేవి. ఈనాడది "యునెస్కో హెరిటేజ్" ప్రాంతంగా పిలవబడుతుంది.

    మారిషస్ లో స్థిరపడిన కొందరు భారతీయ సంతతి వారు:-

    1. అనిరుధ్ జగ్ నౌధ్ - మారిషస్ పూర్వ ప్రధాని, పూర్వ అధ్యక్షుడు
    2. అరిరంగా గోవిందసామి పిళ్ళై - ప్రధాన న్యాయాధిపతి
    3. ఖాల్ తోరా బుల్లీ - ప్రముఖ రచయిత (కూలీ ట్యూడ్ అనే పదాన్ని వాడుకలోకి తెచ్చిన వాడు)
    4. మిషా మన్సూర్ - ప్రముఖ సంగీతకారిణి
    5. నవీన్ రామ్ గూలామ్ - పూర్వ ప్రధాని
    6. రామ్ సీతానెన్ - ఆర్ధిక శాఖామంత్రి , ఉపప్రధానమంత్రి
    7. సర్ శివూసాగర్ రామ్ గూలామ్ - స్వాతంత్ర్య సమరయోధుడు, మొదటి ప్రధానమంత్రి
    8. వివేకా బాబాజీ - మోడల్-నటి .

    ఇండెంచర్ కూలీల సంతతివారు కొన్ని తరాలుగా వేర్వేరు దేశాల్లో స్థిరపడినా అక్కడి ఆచారవ్యవహారాలు, వస్త్రధారణ వంటి వాటికి అలవాట్లలో మార్పు వచ్చినా వారి హృదయాల్లో మాత్రం మేము భారతీయులం అన్న భావన అలాగే పదిలంగా వుంది. 

    ఇప్పటి తరాల యువతకు మాత్రం ఈ భావన కాస్త పలచబడ్డట్లుగా కనిపిస్తున్నది. వారు మేము భారతీయులం అని చెప్పుకోవటానికి మొహమాటపడతారు. ప్రస్తుతం వారున్న పరిస్థితి నుంచి ఆలోచిస్తే ఈ భారతీయ వారసత్వం వగైరాలు వాళ్లకు కలలో జరిగినట్లుగా అనిపిస్తాయనుకుంటాను. వీరిలో చాలామందికి తమ మాతృభాష తెలియదు. ఎప్పుడైనా భారతీయ భాషల్లో నిర్మితమైన సినిమాలు చూసినా అవి ఇంగ్లీషు సబ్ టైటిల్స్ తో ఉంటాయి. ఎప్పుడైనా సెలవుల్లో ఐన ఇండియాను చూసిరావడానికి కూడా పెద్దగా ఇష్టపడరు.

    గత కొంతకాలంగా నేనీ "ఇండెంచర్" గురించి విషయసేకరణకై ప్రయత్నాలు చేస్తున్న సందర్భాలలో గయానా, ఫిజి, ద.ఆఫ్రికా దేశాలలో నివసిస్తున్న ఆయాదేశాల్లో స్థిరపడ్డ కొంతమంది ఇండియన్లను కలిసి మాట్లాడాను. వీరిలో చాలామంది తమ తమ "మూలాలు" (తమ పూర్వీకులు జీవించిన ప్రదేశాలు) గురించి తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని విని నేను చాలా ఖేదపడ్డాను. అన్ని ఇండెంచర్ కాలనీల్లోనూ కలిపి నివసిస్తున్న మొత్తం ప్రవాస భారతీయుల, వెనకటి తరాలవారి పూర్తి వివరాలతో సహా ఒక "ఇండెంచర్ నెట్ వర్క్" వేదిక మొదలుపెట్టే ప్రయత్నంలో ఉన్నాను.

    దీనివల్ల ఈ తరంలోని ఇండెంచర్ సంతతివారికి వారి పూర్వీకుల గురించిన పూర్తి విశేషాలు, వారి వారి మాతృభాషలూ, కళలూ, సంస్కృతులూ, భోజన భాజనాదుల వివరాలూ తెలుసుకునే అవకాశం వుంటుంది. తమ పూర్వీకుల గురించిన జీవిత విశేషాలు చాలామంది హృదయాలకు సాంత్వన కలుగుతుందని నా ఆశ.

    ఈ పుస్తక రచనకు ముందు వివరాలను సేకరించటానికి కొన్ని సంవత్సరాల కాలంపట్టింది. కాని రాబోయే కాలంలో చదువరులకోసం ఈ రచనలను "డిజిటైజ్" చేసిన గ్రంధాలను భద్రపరచగల గ్రంథాలయాలలో భద్రపరచగలందులకుగాను కృషి చేయవలసివుంది. ప్రస్తుతం మనకు అందుబాటులో వున్న కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానంతో ఏ ఇండెంచర్ సంతతి వారికైనా తమ మూలాల్ని, తమ పూర్వీకులనూ గురించిన అన్ని విశేషాలు ఒక "క్లిక్" దూరంలో వుంటాయి.

    నేను నలభై ఐదు లక్షలకు పైగా వున్న ఇండెంచర్ సంతతి నంత ఒక కుటుంబంగా భావిస్తున్నాను. మన పూర్వీకులు చేసిన త్యాగాలను జ్ఞాపకముంచుకొని, శాయశక్తులా ఈ కథని కలకాలం మనందరి మధ్యా అనుబంధాన్ని ముందు తరాల వరకూ సజీవంగా ఉంచగలందులకుగాను కృషి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనతోటి తరాలవారికి మానవతా విలువలను కాపాడగలందులకుగాను విన్నవించుకుంటున్నాను.

     * * * 

     

     

     

     

    share with Whatsapp
    share with Telegram
    Save on Delicious
    Send by email
    Share in Reddit
    • రచయిత గురించి
    • |
    • మమ్ములను సంప్రదించండి