• ఇల్లు
  • ఇండెంచర్
    • చెఱకును గురించిన సంక్షిప్త చరిత్ర
    • సౌతాఫ్రికా లో గాంధీజీ
    • ఆంగ్లేయుల పాలనలో ఇండియా
    • ఇండెంచర్ టైటానిక్
    • 45 లక్షల ఇండెంచర్ సంతతితో మన అనుభందం
    • ఇండెంచర్ గ్రంథాలయం
  • యోగ్యతాపత్రములు
  • కఫాల
    • Kafala – the modern day indenture
  • పుస్తక పఠనములు
  • ఎక్కడ కొనవలెను?
Viriah Viriah
  • ఇల్లు
  • ఇండెంచర్
    • చెఱకును గురించిన సంక్షిప్త చరిత్ర
    • సౌతాఫ్రికా లో గాంధీజీ
    • ఆంగ్లేయుల పాలనలో ఇండియా
    • ఇండెంచర్ టైటానిక్
    • 45 లక్షల ఇండెంచర్ సంతతితో మన అనుభందం
    • ఇండెంచర్ గ్రంథాలయం
  • యోగ్యతాపత్రములు
  • కఫాల
    • Kafala – the modern day indenture
  • పుస్తక పఠనములు
  • ఎక్కడ కొనవలెను?

చెఱకును గురించిన సంక్షిప్త చరిత్ర

  • Print
  • Email
  •  

     

     చెరకుగడల కణుకులు

    మూలం: ఐస్టాక్

    శాక్కరం అఫీసినారమ్ గా లాటిన్ భాషలో పిలవబడే చెఱకులో చాలా రకాలున్నాయి. రుచిలో కొద్దిగా తేడాలున్నా అన్ని రకాల చెరకు నుంచీ మనకు లభించేది చక్కెర (పంచదార)యే. వివిధ భాషల్లో వేర్వేరు పేర్లు, తమిళంలోనూ, సంస్కృతంలో కూడా "సర్కర"గానూ, ప్రాకృతంలో "సక్కర"గానూ, పర్షియన్ (పారశీకంలో) "శాకర్"గానూ, అరబిక్ లో"సుక్కర్" పేరుతోనూ, అస్సీరియన్ లో "స్యూకార్", లాటిన్ లో"సాఖ్ఖరం" గానూ, స్పానిష్ లో "అజూకార్" అనీ ఫ్రెంచి భాషలో "సుక్ర్"గానూ పిలవబడుతోంది.

    వేల సంవత్సరాలనాటి వేదాలలో ఈ చెఱకును గురించిన  ప్రస్తావన వుంది. చాలా పురాతనమైన అధర్వణవేదంలో ఇక్షు (అనగా ఇది బహు తీపికరమైన రుచిగలది)గా వర్ణింపబడివుంది.

    చాలామంది పల్లెవాసులు చెఱకును నమిలి దానిలోని రసాన్ని ఆస్వాదిస్తారు. క్రీ.శ. 350, గుప్తుల పాలనాకాలంలో ఈ చెరకురసాన్ని స్పటికీకరించే విధానాన్ని కనుగొన్నారు.

    ఆరోజుల్లో చెఱకును దంచి, దానినుండి బరువైన తిరగళ్ళతో రసాన్ని పిండేవారు. ఆ రసాన్ని ఎండలో పెట్టి గాని, పెద్ద బానలలో మరిగించిగాని చక్కెరను స్ఫటిక (చిన్న చిన్న గులకరాళ్ళవంటి) రూపంలో రాబట్టేవారు. క్రీ.శ. 600 ప్రాంతంలో ఇండియాలో షర్కర గానూ, పర్షియా (పారశీకం)లో డాక్టర్లు (వైద్యులు)షాకర్ గానూ ఈ చక్కెరను ఉపయోగించేవారు. బహుశా బౌద్ధ సన్యాసులు ఈ చక్కెర తయారు చేసే విధానాన్ని, చెరకునూ చైనాకు తెచ్చి వుంటారని ప్రతీతి. 7(ఏడవ) శతాబ్దానికల్లా చైనాలో చెఱకును పండించడం మొదలెట్టారు.

    హేరోడోటస్, థియోఫ్రాస్టస్ లు వ్రాసిన గ్రీకు చరిత్రలో ఈ "చెక్కెర" ను గురించిన వర్ణన వుంది. మధ్యధరాప్రాంతంలో క్రీ.శ. 750 ప్రాంతంలో చెరకు పండించిన ఆధారాలున్నాయి. అక్కడి నుండి సిద్ధీ అనేమూర్ (ఆఫ్రికన్ జాతీయుడు) ద్వారా స్పెయిన్ లోకి ప్రవేశించిందీ చెరకు.

    మధ్యయుగంలో మత ఛాందసుల మధ్య జరిగిన యుద్ధాల సమయంలో "క్రుసేడర్స్" "రెల్లు" "తుంగ" జాతికి చెందిన "జుక్రా" అనే ట్రిపోలీ ప్రాంతంలో ఎక్కువగా దొరికే తీపి పదార్ధాన్ని తినేవారు. చాలాకాలం పాటు మిగతా పండ్లు ఫలాల వలెనే ఈ చెఱకును కూడా నమిలి రసాన్ని మింగేవారు. యదార్ధానికి చెరకును నమిలి తిన్నప్పుడు కలిగే ఆనందం వర్ణనాతీతం. మరో ప్రయోజనం కూడా వుంది చెఱకును నమలడం వల్ల దంతాలు (పళ్ళు) గట్టిపడతాయనే భావన కూడా వుంది. మనం ఈనాడు చూస్తున్న చక్కెర తయారవడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. ఎన్నో లక్షల మంది జీవితాల అర్పణ జరిగింది. ఇంకా సైన్సు, కెమిస్ట్రీ ప్రయోగాలు లెక్కకుమించి జరిగాయి.

    మృష్టాన్నాలపై పెరిగిన మక్కువ:

    15వ (పదిహేనవ) శతాబ్దం వరకూ చక్కెరను కూడా వంటలో ఒక సుగంధద్రవ్యంగానే వాడేవారు. కాని ఇది రాజులకు, గొప్ప ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఉదాహరణకి క్రీ.శ. 1319లో ఒక పౌండు(అరకిలో) ధర రెండు (2) షిల్లింగులు ఉండేది (ఈనాటి ధర ప్రకారం సుమారు $100 (ఒక వంద) డాలర్లు వుంటుంది. ధనవంతుల ఇళ్ళల్లో విందులు, పార్టీలు జరిగినప్పుడు చక్కెరనుపయోగించి వండిన ఫలహారాలు, డెజర్ట్లు వడ్డించేవారు. రాజుల, మహారాజుల ఇళ్ళలో జరిగే వివాహాలలో, అతి ఖరీదైన విందుల సందర్భాలలో అలంకరణ కోసం చక్కెరతో చేయబడ్డ శిల్పాలను విందు ఆవరణల్లో అమర్చేవారు. క్రీ.శ. 1600 సం. అక్టోబరు నెలలో ఫ్రాన్స్ రాజైన హౌజ్ ఆఫ్ బౌర్బనుకు చెందిన హెన్రీ iv తో జరిగిన వివాహంలో "మేరీ-డి-మెడిచి" ఫ్రాన్స్ మహారాణి అయ్యింది. పలాజ్జో వెచ్చియో అనే విశాలమైన రాజప్రాసాదంలో జరిగిన విందు సందర్భంలో ఆ ప్రదేశమంతా "చక్కెర శిల్పాలతో" అలంకరించారట. వీనస్, హెర్క్యూలిస్, గుర్రం మీద కూర్చున్న ఫ్రాన్సు రాజుగారి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా చక్కెర శిల్పాలను తయారు చేశారట.

    యూరోపియన్ వ్యాపారస్తులకు చక్కెర గిరాకీ నానాటికీ విపరీతంగా పెరగసాగింది. ఇండియా, చైనా, స్పెయిన్, సైప్రస్ ఇంకా మధ్యధరాప్రాంతం నుండి దిగుమతి అయ్యే చక్కెర వీరి అవసరాలను ఏమాత్రం తీర్చలేకపోవడంతో క్రొత్త క్రొత్త ప్రాంతాలలో పెద్ద ఎత్తున చెఱకును పండించడం మొదలెట్టారు.

    ఉవ్వెత్తున ఎగసిన- వలస విధానం:

    క్రీ.శ. 1500 (16 వ శతాబ్దంలో)లో యూరప్ లోని కొన్ని దేశాలు (పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, ఇంగ్లాండు ఇంకా నెదర్ ల్యాండ్స్ లాంటివి) తమ తమ రాజ్యాలను సముద్రాలను దాటి విస్తరించుకోవడానికై ప్రయత్నాలు ప్రారంభించాయి.  అంతకుముందు ప్రపంచంలోని చాలా దేశాలు కనీ-వినీ ఎరుగని తుపాకులు, ఫిరంగులతో పెద్ద పెద్ద ఓడలలో నావికాదళాలతో కలిసి వ్యాపారాలు చేయటానికి అవసరమైతే యుద్ధాలు చేయడానికి కూడా సిద్ధపడి సముద్రయానాలు, యుద్ధాలు చేయసాగారు. బ్రెజీలు, మెక్సికో, ఇండియా, ఇండోనేషియా, సౌతాఫ్రికా ఇంకా వెస్టిండీస్ వంటి దేశాలు వీరిదాటికి పేకమేడల్లా కూలిపోసాగాయి.

    1493లో మొదటిసారిగా వెస్టిండీస్ దీవులకు చెరకును తీసుకొచ్చినవాడు క్రిష్టఫర్ కొలంబస్. నేటి హిస్ఫలోనియా ప్రాంతం, హైతీ ఇంకా డొమినిక్ రిపబ్లిక్ దేశాలకు మొదటగా చెఱకుని పండించినవారు కూడా కొలంబస్ (కొడుకూ, మనువలూ) వారసులే! కాని వారెదుర్కొన్న మొదటి సమస్య చాలినంత మంది కార్మికులు, కూలీల కొరత.

    ఆధునిక యుగంలో బానిసలు, బానిసత్వం:-

    1441లో అంటావో గొంజాల్వెజ్ అనే పోర్చుగీసు (సముద్ర) వ్యాపారి, తన ఓడలో మొదటిసారిగా కొంతమంది ఆఫ్రికన్ కూలీలను పోర్చుగల్ కి బానిసలుగా తెచ్చి ఈనాటి ఆధునికయుగంలో అతి లజ్జాకరమైన బానిస విధానానికి నాంది పలికాడు. అనతికాలంలోనే స్పెయిన్, బ్రిటీషుదేశాలు పోర్చుగల్ ను వెనుకకు నెట్టేసి ప్రపంచమంతటా ఈ "బానిస" వ్యవస్థను వ్యాపింపచేశాయి. అప్పట్లో అన్నిదేశాల కన్నా ఈ బానిసవ్యవస్థ సౌతాఫ్రికాను విపరీతంగా అతలాకుతలం చేసివేసింది.

    క్రీ.శ. 1500 నుండి 1800 మధ్యకాలంలో 11 (పదకొండు) మిలియన్ల మంది బానిసలు ఆఫ్రికా నుండి ఇతరదేశాలకు తరలించబడ్డారు. వీరిలో సుమారు ఆరుమిలియన్ల (అరవై లక్షలమంది) మంది "వెస్టిండీస్"(హైతీ, జమైకా, క్యూబా, బార్బడోస్ ఇంకా కొన్ని చిన్న చిన్న ద్వీపాలు) దీవులలో చెరకు పండించడానికీ, చక్కెర కర్మాగారాలలోనూ స్థిరపడ్డారు. మిగిలిన వారు బంగారం గనుల్లోనూ, బొగ్గు గనుల్లోనూ కార్మికులుగా స్థిరపడ్డారు.

    క్రీ.శ. 1700 వరకల్లా మొత్తం వెస్టిండీస్ దీవులలో ప్రధానమైన పంట “చెరకు” అయిపోయింది. దీనిలో వ్యవసాయకూలీలు, కార్మికులందరూ ఆఫ్రికా నుండి తేబడ్డ బానిసలే. వీరంతా తమ రక్తాన్ని, చెమటగా మార్చి ధారబోసి కృషి ఫలితాలు ఈ చెరకు వ్యవస్థ యజమానులకు కనీ వినీ ఎరుగని స్థాయిలో లాభాలనార్జించసాగాయి. ఓవైపు ఈ బానిస కూలీలు, కార్మికులు అతిహీనంగా, హేయంగా బ్రతుకులు వెళ్ళమారుస్తుంటే ఈ దొరలు(యజమానులు) మాత్రం ఇంగ్లాండు, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలలో విలాసవంతమైన జీవితాలను గడపసాగారు. దుర్భర దారిద్ర్యంతో హీనాతిహీనంగా బ్రతుకులు వెళ్ళమారుస్తున్న కూలీల అతీ గతీ పట్టించుకోవడం మానేశారు. ఫలితంగా 1783లో యాంటీ స్లేవరీ మూవ్ మెంట్ (బానిస వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు) మొదలైంది.

    ఈ తిరుగుబాటు ఊపందుకోవడానికి దాదాపు యాభై సంవత్సరాలు పట్టింది. ఈ బానిసల తరపున నాయకత్వం వహించి (బ్రిటిషు ప్రభుత్వంతో పోరాడిన విల్బర్ ఫోర్స్ 1883 నాటికి విజయం సాధించాడు). మొత్తం బ్రిటిషు సామ్రాజ్యం అంతటా బానిస వ్యవస్థ నిర్మూలనకు చట్టం చేయబడింది.

    కానీ రోజురోజుకీ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న చక్కెర అవసరాలు తీర్చడానికి చెరకు ఉత్పత్తి పెద్ద స్థాయిలో పెంచవలసివచ్చింది. వ్యాపార కోణం నుంచి ఇది ఎంతో లాభసాటిగా వున్నా చెరకు పండించడానికి కావలసినంతమంది కూలీలు కార్మికుల లభ్యత ఒక సమస్యగా మారింది. ఉదాహరణకి 1710లో (బ్రిటను లో వున్న చక్కెరతో అవసరాలు 1770కి దాదాపు ఐదు రెట్లు పెరిగింది. 1874లో చక్కెర మీద ఏ విధమైన "పన్ను" లేకుండా చేసింది ప్రభుత్వం. ధర అందుబాటులో ఉండడంతో ఇంటింటా ఈ చక్కెర ఉపయోగం ఎక్కువైపోయింది. అతి సామాన్యుడు కూడా ఉదయం, సాయంత్రం టీ, కాఫీలు సేవించడం ఒక అలవాటుగా అయిపోయింది. ఈ పెరుగుతున్న చక్కెర అవసరాలను తీర్చడానికి గాను, ప్రపంచవ్యాప్తంగా రైతులకు చెరకు పంటను గణనీయంగా పెంచవలసివచ్చింది.

    చాలాకాలంగా బానిసలతో తమ వ్యవసాయ, వ్యాపారాలను ఎంతో లాభసాటిగా నిర్వహిస్తున్న వారికి బానిసలకు ప్రత్యామ్నాయంగా మరో దారి అత్యవసరంగా వెదుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. 1842లో జే.పి.గ్రాంట్ సూచించిన "ఇండెంచర్-ఇమ్మిగ్రేషన్" విధానానికి బ్రిటీషు పార్లమెంటు అనుమతించింది. 1840లలో రూపుదిద్దుకొన్న ఈ ఇండెంచర్ పధ్ధతి బానిస వ్యవస్థ కన్నా కొంచెం మెరుగ్గా వున్నా కూలీల/కార్మికుల జీవితాలను ఏమాత్రం మెరుగుపరచలేకపోయింది.

    ఇదే సమయంలో ప్రపంచచరిత్రలో "పారిశ్రామిక యుగం" ఉదయించింది. దీనిని యాంత్రిక యుగంగా కూడా పేర్కొనవచ్చు. మెషీన్లు, యంత్రాలు కనుగొనడంతో, మానవ అవసరాలను తీర్చగల బట్టలు, స్టీలు (ఇనుము,ఉక్కు) ఇంకా షుగర్ (చక్కెర) ఉత్పత్తి సులభమైంది. చక్కెర ఉత్పత్తికి కావలసిన యంత్రాలు లభ్యంకావడంతో చక్కెర ఉత్పత్తి పూర్తిగా యంత్రాల మీదనే మొదలైంది. 1768లో జమైకా లో మొదటిసారిగా ఆవిరిశక్తితో నడిచే యంత్రాలు చక్కెర ఉత్పత్తిని ప్రారంభించాయి. 1813లో ఎడ్వర్డ్ ఛార్లెస్ చక్కెర ఉత్పత్తిలో ఆవిరితో నడిచే యంత్రాన్ని ఉపయోగించాడు. తరువాత 1850లో డేవిడ్ వెస్టన్ "సెంట్రిఫ్యూజ్"ని ఉపయోగించి చక్కెరను, మొలాసిస్ ను వేరు పరచే పధ్ధతి కనిపెట్టాడు. ఈ ప్రయోగాలు, సాంకేతిక పద్ధతులనుపయోగించి తక్కువ వ్యయంతో చక్కెరను ఉత్పత్తి చేయగలిగారు.

    చెరకునుంచి, బెల్లం, చక్కర ఉత్పత్తి వరకూ జరిగే పరిణామక్రమాన్ని ఈ క్రింద పొందుపరుస్తున్నాను.

     

     

    చెఱకు నుండి చక్కర తయారీ విధానం

    మూలం: ఇంటర్నెట్

    ఎడ్లతో నడిపే గానుగల నుంచి ఆవిరితో నడిచే యంత్రాల శకం వచ్చి, వివిధరకాల ఎక్స్-ట్రాక్టర్లు, బాయిలర్లు, సెంట్రిఫ్యూజ్ లు వగైరా ఉపయోగంలోకి వచ్చేసాయి. కాలక్రమేణా కార్మికులు/కూలీల అవసరం లేకుండా పనులు జరగడం మొదలైంది. విత్తనాలు నాటడం, కలుపు తీయడం, పంటను కోయడం, నూర్చడం వంటి పనులు కూలీలే చేసేవారు. కాని ఇప్పుడవన్నీ మెషిన్లే (యంత్రాలే) చేయడం మొదలైంది.

    1960లు వచ్చేసరికి వ్యవసాయంలో కూలీల ఆవశ్యకత 80 నుండి 90% (శాతం) వరకూ పడిపోయింది.

    మరి కొద్దికాలంలోనే సెన్సార్లు, శాటిలైట్ల సాయంతో నడిచే విత్తనాలు నాటడం నుంచి కోతల(హార్వెస్టింగ్) వరకు మెషిన్ల ద్వారానే 24 (ఇరవై నాలుగుగంటలూ) పనులు సాగడం మొదలైంది. ఎండకు గాని, వానకు గాని పనులు ఆపాల్సిన అవసరం లేకుండాపోయింది.

    వివిధరకాల ప్రయత్నాల ద్వారా ఎక్కువ చెరకు పండించడం, చెరకులో రసాన్నీ, తీయదనాన్ని ఎక్కువ చేయడానికి చేస్తున్న ప్రయోగాలకు మెల్లగా తెరపడుతున్నట్లుగా కనిపిస్తున్నది. చక్కెరకు బదులుగా ప్రయోగశాలల్లో (లాబరేటరీలలో) తయారయ్యే ఇతర వికల్పాలు అందుబాటులోనికి తేబడుతున్నాయి.

    1967లో మొక్కజొన్ననుండి "హై ఫ్రూక్టోస్ కార్న్ సిరప్" అనే చాలా ఎక్కువ తీపికరమైన చక్కెర పదార్ధాన్ని కనుగొన్నారు. ఈ చక్కెర ఒక్క తీపినే కాక మనుష్యుల శరీరాల్లోని మధ్యభాగాన్ని (నడుములను) ఇంకా డాక్టర్ల బిల్లులను భరించలేని స్థాయికి పెంచేసింది (రకరకాల అనారోగ్యాలను కలుగజేస్తున్నది). ఈ "కార్న్ సిరప్" ను మొక్కజొన్న నుంచి తయారుచేస్తారు. దీని తయారీలో ఎన్నో రకాల రసాయనాలను ఉపయోగిస్తారు. చాలా ఎక్కువ లభ్యత, తక్కువ పన్నులభారం, చాలా తక్కువ సమయంలో తక్కువ స్థలంలో (ప్రయోగశాలల్లో) ఎక్కువ చక్కెరను తయారుచేయగలగడం, అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, చెరకు చక్కెర కన్నా చౌకగా దొరకడం వల్ల దీని ఉపయోగం నానాటికి పెరుగుతున్నది.

    చాలా కొద్దికాలంలోనే ప్రపంచమంతా ఈ "హై ఫ్రూక్టోస్ కార్న్ సిరప్" సర్వవ్యాపి అయిపోయింది. ఈనాడు మనం ఏ పదార్ధం కొన్నా దాంట్లో హై ఫ్రూక్టోస్ కార్న్ సిరప్ వుండితీరుతుంది. మార్కెట్లో కొనే అన్ని పదార్ధాల సీసాలపైనా, పేకెట్లపైనా ముద్రించిన వివరాలలో మనం ఇది గమనించవచ్చు.

    ఇప్పటి తాజా గణాంకాల ప్రకారం సరాసరిన ప్రతి అమెరికన్ పౌరుడు ఏడాదికి 150 (నూటయాభై) పౌండ్ల చక్కెరను వాడుతున్నాడు. దీనిలో ఎన్నోరకాల చక్కెరలూ (హై ఫ్రూక్టోస్ కార్న్ సిరప్) మనం కొన్నితరాలుగా వాడుతున్న చెరకు చక్కెర, ఇంకా కొన్ని కృత్రిమమైన తీపిపదార్ధాలు వున్నాయి. ఈ మితిమీరిన చక్కెర ఉపయోగించడం వల్ల ఊబకాయం, హృద్రోగాలు, అధికరక్తపోటు వంటి జబ్బులు అమెరికాను రోగగ్రస్తం చేస్తున్నాయి.

    నాకు ఈ మధ్యే తెలిసిన చాలా బాధాకరమైన విశేషమేమిటంటే ఈ ఇండెంచర్ అవశేషాలు ఇంకా అక్కడక్కడా సజీవంగా కనిపిస్తూనే వున్నాయి. టూరిస్టులు (విశ్రాంతి కోసం వెళ్ళే యాత్రీకులు) వెళ్ళే చోట్లలో డొమినిక్ రిపబ్లికన్ లోని "పుంటాకానా", బీచ్ రిసార్టుల నుండి ఒక గంట ప్రయాణదూరంలో వున్న చెరకు పొలాల్లో కూలీలు నేటికీ బానిసలుగానే బ్రతుకులు వెళ్ళమారుస్తున్నారు.

    డొమినికన్ రిపబ్లిక్, హైతీ లను కలిపి "హిస్పానియోలా" గా వ్యవహరిస్తున్నారు. ఈ ఒక్క డొమినికన్ రిపబ్లికన్ లోనే ఏడాదికి దాదాపు 200,000 (2లక్షల) టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుంది.

    సుమారుగా 12 లక్షల టన్నుల చక్కెరను ఉపయోగించగల అమెరికాకే మొత్తం చక్కెర ఎగుమతి చేయబడుతున్నది. ప్రతి సంవత్సరం చెరకు కోతల సమయంలో కాస్త బీదదేశము, ఎక్కువ కూలీలున్న "హైతీ" నుండి "డొమినికన్ రిపబ్లిక్" కి అవసరమైన మొత్తం కూలీలు తేబడుతున్నారు. హైతీ నుండి డొమినికన్ రిపబ్లిక్ లోనికి సరిహద్దులు దాటుతున్నప్పుడు, సరిహద్దు దగ్గరి అధికారులు కూలీల ఐడెంటిటీ (గుర్తింపు) పత్రాలు స్వాధీనపరచుకుంటారు (వెనకటి రోజుల్లో వీరయ్య ఇంకా అతని స్నేహితులకు ఒకటిన్నర శతాబ్దాల క్రితం జరిగిన అనుభవమే ఇది). ఈ కూలీలు తాము పనిచేసే చెరుకు ఫారం హద్దులుదాటి వెళ్ళరాదు, పగలంతా పొలంలో పని, రాత్రిళ్ళు జైలు మాదిరిగా ఉండే షెడ్లలో మకాం ఏర్పాటుచేయబడుతుంది. గణాంక శాస్త్రజ్ఞుల అంచనాల ప్రకారం దాదాపు 10 (పది) లక్షలమంది "హైతీ కూలీలు" రోజుకు 14 గంటలు చొప్పున వారమంతా (ఏడు రోజులు) పనిచేయాల్సివుంటుంది. వారికిచ్చే భత్యం మాత్రం రోజుకి 1యు.ఎస్ డాలర్ (దాదాపు 60 రూపాయలు) కన్నా తక్కువే.

    రెవరెండ్ క్రిష్టోఫర్ హార్ట్ లే గారు తీసిన ఒక డాక్యుమెంటరీ "షుగర్ కేన్ ఫార్మ్స్ ఆఫ్ ది డొమినికన్ రిపబ్లిక్" (ఈ చిత్రం "యూట్యూబ్ లో  చూడవచ్చు")లో వివరంగా చూపించారు. ఈ చిత్రంలో ఈ ఆధునిక యుగంలో కూడా హీనగ్రస్తమైన బానిసవిధానం కొనసాగుతున్న వైనం వివరంగా కానవస్తుంది.

    గత ఇరవై శతాబ్దాలుగా చక్కెర పరిణామక్రమం:

     

    ఈనాడు ప్రధానంగా చెరకు పండిస్తున్న మొదటి పదిదేశాల లిస్టులో జాబితాలో ఇండెంచర్ కాలంలో చెరకు పండించిన ఒక్కదేశం పేరు కూడా లేకపోవడం గమనార్హం. ఈ పదిదేశాల పేర్లను ఈ క్రింద పొందుపరుస్తున్నాను.

    పదిదేశాలు:-

    1. బ్రెజీలు
    2. ఇండియా
    3. చైనా
    4. థాయ్ లాండ్
    5. పాకిస్థాన్
    6. మెక్సికో
    7. కొలంబియా
    8. ఫిలిప్పైన్స్
    9. ఇండోనేషియా
    10. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా

    ఈ పరిణామం బహుశా ఆనాటి ఇండెంచర్ కూలీల శాపఫలితమై ఉండవచ్చునేమో??

    ఈ చక్కెర పరిశ్రమ రాబోయే కాలంలో ఇంకా ఇంకా కొత్తపుంతలు తొక్కుతూ ఎన్నో రెట్లు అభివృద్ధి కావచ్చు.

    బహుశా ఆనాటికి ఈ చెరకు ఉత్పత్తిలో తమ రక్తం ధారబోసి కృషిచేసి బానిస వ్యవస్థలో తనువులు చాలించిన లక్షలమంది మనుష్యులను మనం మరచిపోతామేమో - వారందరికీ నా శ్రద్ధాశ్రువులర్పిస్తున్నాను.

     * * * 

     

    share with Whatsapp
    share with Telegram
    Save on Delicious
    Send by email
    Share in Reddit
    • రచయిత గురించి
    • |
    • మమ్ములను సంప్రదించండి